Muhammad Waseem: పసికూన ప్లేయర్ తడాఖా: రోహిత్ శర్మ ఆల్‌టైం రికార్డ్ బద్దలు కొట్టిన UAE కెప్టెన్

Muhammad Waseem: పసికూన ప్లేయర్ తడాఖా: రోహిత్ శర్మ ఆల్‌టైం రికార్డ్ బద్దలు కొట్టిన UAE కెప్టెన్

యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం టీ20 క్రికెట్ లో నిలకడగా రాణించే అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకడు. పసికూన దేశం యూఏఈకి కెప్టెన్సీ చేస్తున్న వసీం పేరు క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్దగా ఎవరికీ పరిచయం ఉండదు. ఈ యూఏఈ కెప్టెన్ ఆడిన గొప్ప ఇన్నింగ్స్ లు అన్ని అండరేటెడ్ గా మిగిలిపోయాయి. అయితే సోమవారం (సెప్టెంబర్ 1) తన బ్యాటింగ్ తో ఒక్కసారిగా సంచలనంగా మారాడు. టీ20క్రికెట్ లో ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..  

ట్రై సిరీస్ లో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 1) యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో యూఏఈ ఓడిపోయినా కెప్టెన్ గా ముహమ్మద్ వసీం మెరుపులు నేర్పించాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో వసీం 37 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్ లో ఆరు సిక్సర్లతో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు (110) బాదిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి వరకు 105 సిక్సర్లతో రోహిత్ శర్మ అగ్ర స్థానంలో ఉండగా.. ఈ రికార్డును బ్రేక్ చేసి వసీం టాప్ లోకి వెళ్ళాడు. 

ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ బౌలింగ్ లో రెండో సిక్సర్ కొట్టి వసీం ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (173)ను వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానానికి చేరుకున్నాడు. సిక్సర్లలో కెప్టెన్ గా రెండో స్థానానికి పడిపోయిన రోహిత్.. ఓవరాల్ గా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 206 సిక్సర్లతో టాప్ లో నిలిచాడు. ఈ మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఆఫ్ఘనిస్తాన్ 38 పరుగుల తేడాతో గెలిచింది.