బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లలో మైనర్టీలపై దాడులకు పాల్పడటం హీనమైన చర్యగా ముహమ్మద్ యూనస్ పేర్కొన్నాడు. ఆందోళనకారులు హిందూ, క్రైస్తవ మరియు బౌద్ధ కుటుంబాలకు హాని కలిగించవద్దని కోరారు. ఆగస్ట్ 11(ఆదివారం) రంగ్‌పూర్ నగరంలోని బేగం రోకేయా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి యూనస్ మాట్లాడారు.
బంగ్లాదేశ్ లో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి 52 జిల్లాల్లో దాదాపు 205 దాడులు మైనార్టీలపై జరిగాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ముహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేశారు. హింస, అల్లర్లు కారణంగా వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు దాడుల నుంచి తప్పించుకోవడానికి భారత్ రాడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు బంగ్లాదేశ్ భవిష్యత్ విద్యార్థుల చేతులో ఉందని.. దేశాన్ని మీకు కావాల్సిన స్థాయికి తీసుకెళ్ల శక్తి యువతకు ఉందని ఆయన అన్నారు. మైనార్టీలపై దాడులు హీనమైనదిగా వర్ణించి.. ఖండించారాయన. మీరు ఈ దేశ ప్రజలు కాదా? మీరు దేశాన్ని రక్షించగలిగారు, కొన్ని కుటుంబాలను రక్షించలేరా? అని చెప్పారు. దేశంలో మైనార్టీ కుటుంబాలపై జరుగుతున్న దాడులనుంచి వారిని కాపాడాలని పిలుపునిచ్చారు. వారు నా సోదరులు, మనం కలిసి పోరాడాము.. కలిసే ఉంటామని బంగ్లాదేశ్ జాతీయ ఐక్యత అవసరాన్ని ముహమ్మద్ యూనస్ చెప్పుకొచ్చారు.