ప్రాపర్టీ విలువ  రూ.640 కోట్లని అంచనా 

ప్రాపర్టీ విలువ  రూ.640 కోట్లని అంచనా 
  • దుబాయ్‌లో ఖరీదైన విల్లా కొన్నది ముకేశ్ అంబానీనే!
  • చిన్న కొడుకు  అనంత్‌ అంబానీ కోసం..
  • ప్రాపర్టీ విలువ  రూ.640 కోట్లని అంచనా 

న్యూఢిల్లీ: దుబాయ్‌‌‌‌లోనే అత్యంత ఖరీదైన విల్లాను కొన్న మిస్టరీ బయ్యర్‌‌‌‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌‌  ముకేశ్‌‌ అంబానీనేనని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  చిన్న కొడుకు అనంత్ అంబానీ కోసం ఈ విల్లాను తీసుకున్నారని చెప్పారు. బీచ్‌‌కు దగ్గరలోని ఈ ప్రాపర్టీ పామ్‌‌ జమైరహ్‌‌లో ఉంది. ఈ విల్లా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్‌‌ సుమారు రూ. 640 కోట్లు (80 మిలియన్ డాలర్లు) ఖర్చు చేశాడని, దుబాయ్ చరిత్రలోనే  అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్‌‌గా ఇది నిలిచిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. తాటి చెట్టు ఆకారంలోని ఆర్టిఫీషియల్‌‌గా నిర్మించిన ఐలాండ్‌‌కు ఉత్తరాన ఈ విల్లా ఉంది. ఈ విల్లాలో 10 బెడ్‌‌రూమ్‌‌లు, ఒక  ప్రైవేట్‌‌ స్పా, ఇండోర్‌‌‌‌, అవుట్‌‌డోర్ పూల్స్‌‌ ఉన్నాయని దుబాయ్ మీడియా పేర్కొన్నాయి. కానీ, బయ్యర్‌‌‌‌ గురించి మాత్రం బయటపెట్టలేదు.  ఈ మధ్య కాలంలో  అంబానీ ఫ్యామిలీ విదేశాలలో  రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను కొనడం పెంచింది. కిందటేడాది యూకేలో  79 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్టోక్ పార్క్‌‌ను  రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ ఇల్లు జార్జియన్ కాలం నాటిదని అంచనా. ముకేశ్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ కోసం ఈ   ఇల్లును తీసుకున్నారు. కూతురు ఇషా కోసం న్యూయార్క్‌‌లో ఇల్లు వెతుకుతున్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. తాజాగా దుబాయ్‌‌లో కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిలయన్స్ ఆఫ్ షోర్ సంస్థ  కంట్రోల్‌‌లో ఉంటుందని అన్నారు.  ఈ ప్రాపర్టీ సెక్యూరిటీ కోసం మరింతగా అంబానీ ఖర్చు చేయనున్నారని పేర్కొన్నారు.  అంబానీ ఫ్యామిలీకి  ప్రైమరీ రెసిడెన్స్‌‌గా అంటిల్లా (ముంబై) నే కొనసాగుతుందన్నారు.

పిల్లలకు బిజినెస్‌‌ పంచడంపైనే..

ఈసారి జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు హోల్డర్ మీటింగ్‌‌లో తన  వారసులకు బిజినెస్‌‌లను అప్పగించడంపైన, జియో 5జీ అమలు పైన ముకేశ్ అంబానీ మాట్లాడతారనే అంచనాలు ఎక్కువయ్యాయి.  5జీ ని అమల్లోకి తెవడం ద్వారా తన టెలికం బిజినెస్‌‌ వాల్యూని ఎలా పెంచుతారనే అంశంపైనా,  జియో, రిలయన్స్ రిటైల్‌‌ బిజినెస్‌‌లను సపరేట్‌‌గా మార్కెట్‌‌లో లిస్టింగ్‌‌ చేయడం పైనా అంబానీ మాట్లాడే అవకాశం ఉంది. లిస్టింగ్‌‌కు ముందు ఈ బిజినెస్‌‌లను ఎలా సపరేట్ చేస్తారు? వీటి వాల్యూని ఎలా అన్‌‌లాక్ చేస్తారు? అనే అంశాలపై ఈసారి షేరు హోల్డర్ల మీటింగ్‌‌లో ఫోకస్‌‌ పెరగనుంది. అంతేకాకుండా తన ముగ్గురు పిల్లలకు రిలయన్స్ బిజినెస్‌‌లను ఎలా అప్పజెప్పుతారనే అంశంపైన కూడా అంబానీ మాట్లాడొచ్చు. ముకేశ్ అంబానీ ఇప్పటికే జియో ఇన్ఫోకామ్‌‌   చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లేస్‌‌ను పెద్ద కొడుకు ఆకాశ్‌‌ అంబానీ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముకేశ్ అంబానీ హెల్త్‌‌ బాగోలేదనే రూమర్లు పెరుగుతుండడంతో బిజినెస్‌‌లను  పిల్లలకు ఎంత సమర్ధవంతంగా ట్రాన్స్‌‌ఫర్ చేస్తారనే అంశంపైన ఇన్వెస్టర్లు ఎక్కువ దృష్టి పెడుతున్నారు.