కమీషన్ల కోసం మ్యూల్ అకౌంట్ల బిజినెస్.. సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్న వ్యక్తి అరెస్ట్

కమీషన్ల కోసం మ్యూల్ అకౌంట్ల బిజినెస్.. సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్న వ్యక్తి అరెస్ట్
  • బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్లు గుర్తింపు

గచ్చిబౌలి, వెలుగు: కమీషన్లకు ఆశపడి సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్లు విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్, ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్, ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ డీసీపీ శోభన్ వివరాలు వెల్లడించారు. 

రాజస్థాన్ లోని నాగూర్ జిల్లాకు చెందిన చిమన్‌‌‌‌‌‌‌‌సింగ్ కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి జీడిమెట్ల సమీపంలోని అపరూప కాలనీలో స్థిరపడ్డాడు. అతని కొడుకు దిలీప్‌‌‌‌‌‌‌‌సింగ్ (27)కు 2024లో ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ లో జోర్డాన్, పింటూ భయ్యాలతో పరిచయం ఏర్పడింది. వాట్సాప్ ద్వారా సంప్రదించిన వారు బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తే కమీషన్ ఇస్తామని ఆఫర్ చేశారు.

రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించి..

కమీషన్ ఆశతో దిలీప్‌‌‌‌‌‌‌‌సింగ్ స్టూడెంట్స్​, చిరు ఉద్యోగులు, కూలీల నుంచి పెద్ద సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు సేకరించాడు. సేవింగ్స్ అకౌంట్లకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు, చిరు వ్యాపారుల కరెంట్ అకౌంట్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాడు. ఈ అకౌంట్లను కమీషన్ ప్రాతిపదికన జోర్డాన్, పింటూలకు అప్పగించాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్, కుత్బుల్లాపూర్ ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ పోలీసులు దిలీప్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ను గురువారం అరెస్ట్ చేశారు.

 రూ.లక్ష, మూడు ఫోన్లు, 12 డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డు, మూడు బ్యాంకు పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్, ఏడు చెక్‌‌‌‌‌‌‌‌బుక్స్, వివిధ రాష్ట్రాలకు కొరియర్ చేసిన 33 బ్యాంకు పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. 23 బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. యెస్ బ్యాంకు, కోటాక్ బ్యాంకులకు చెందిన కొందరు అధికారులు నిందితులతో కుమ్మక్కై అకౌంట్లు తెరవడానికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.