మేడారం మాస్టర్ ప్లాన్ పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ దివాకర

మేడారం మాస్టర్ ప్లాన్ పనులను స్పీడప్ చేయాలి :  కలెక్టర్ దివాకర

తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్ ప్లాన్ పనుల్లో వేగం పెంచాలని ములుగు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో మాస్టర్​ ప్లాన్ లో భాగంగా జరుగుతున్న వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ మ్యాప్ ను పరిశీలించి అందులో ఉన్న విధంగానే పనులను చేయాలని సూచించారు. 

మహా జాతరకు 100రోజులే సమయం ఉన్నందున ముందుగా గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలపనులను మొదలు పెట్టామని తెలిపారు.అనంతరం మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో పూజారులు, గ్రామ పెద్దలు రైతులతో భూసేకరణ గురించి మాట్లాడారు. గిరిజనులు పవిత్రంగా పూజించే సమ్మక్క, సారలమ్మ వన దేవతల ఆలయాన్ని వందల ఏండ్లు గుర్తుండేలా రాతి కట్టడాలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. 

ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత కాటేజీలకు వివిధ షాపింగ్ మాల్ లకు భూమి అవసరము ఉన్నందున రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు . గవర్నమెంట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. కలెక్టర్​ వెంట పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి, ములుగు ఆర్డీవో వెంకటేశ్, స్థానిక తహసీల్దార్ సురేశ్ బాబు, ఎండోమెంట్ సిబ్బంది, అధికారులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.