ములుగు/ తాడ్వాయి/ ఏటూరునాగారం, వెలుగు : ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాలు పెరిగాలని, జీరో శాతం విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. 12 మంది స్టూడెంట్లు ఉన్న చిన్నబోయినపల్లి స్కూలులో 120 మంది చేరడం ఆదర్శనీయమని, పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపు, ఎఫ్ఎల్ఎన్ మిషన్, ఎఫ్ఆర్ఎస్ హాజరు, బడిబాట, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 12 నుంచి 120 మందికి పైగా పెంచడంలో కృషి చేసిన కానిస్టేబుల్ ధూపాటి సతీశ్, సర్పంచ్‌ను కలెక్టర్ అభినందించి, సత్కరించారు. అనంతరం కలెక్టర్ తాడ్వాయి మండలం హైవే మార్గంలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను సందర్శించారు. ఐలాండ్ పరిసర ప్రాంతాలు, వాచ్ టవర్ ను పర్యాటకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రామంలోని గ్రంథాలయం యువతకు ఉపయోగపడుతుందని, గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ధూపాటి సతీశ్2024లో స్వచ్ఛందంగా గ్రంథాలయం ఏర్పాటు చేసి రూ.1.50 లక్షలు విలువైన పోలీ పరీక్షల పుస్తాలను అందుబాటులో ఉంచడాన్ని ఆయన అభినందించారు.
