కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం 

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం 

ములుగు : ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద సహాయక చర్యల్లో భాగంగా బోటుపై వెళ్తుండగా గోదావరి నదిలో బోటు ఉన్నట్టుండి ఆగిపోయింది. బోటు పక్కకు కొట్టుకు వచ్చి చెట్టుకు తగిలి ఒడ్డుకు చేరుకుంది. అడవి మధ్యలో నుంచి కాలినడకన ఎమ్మెల్యే సీతక్క బయటకు వచ్చింది. ఈ ఘటన ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో జరిగింది. 

గోదావరికి వరద పోటెత్తడంతో నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాలు గోదావరి వరదతో నీట మునగడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గం ప్రజల కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. 

వరద నీటిలోనూ, మోకాళ్ళ లోతు నీళ్లలోనూ కాలినడకన వెళ్లి వరదలో చిక్కుకున్న గ్రామాల్లో పర్యటిస్తూ... ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను ఎమ్మెల్యే సీతక్క అందిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాకుండా, మానవత్వం ఉన్న నాయకురాలిగా వరద సహాయాన్ని అందిస్తున్నారు. గతంలోనూ కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో మారుమూల గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క ఇంటింటికి తిరిగి ప్రజలకు కావాల్సిన సహాయాన్ని అందించారు.