ములుగు, వెలుగు: ములుగు జిల్లాను పూర్తి స్థాయిలో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని, వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా బుధవారం ములుగు మండలం జాకారం గ్రామంలో హైవే నుంచి పురాతన శివాలయం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పురాతన శివాలయాన్ని సందర్శించి ఆలయ చరిత్రను గైడ్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాను పర్యాటకరంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, చారిత్రక సంపదను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు ఇతర అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. బొగత జలపాతం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం, తాడ్వాయి హట్స్, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బ్లాక్ బెర్రీ ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ ఏడీ బుజ్జి, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు పాల్గొన్నారు.
