
మహిళా భద్రత విషయంలో ఎప్పటిలాగే ముంబై మొదటి స్తానాన్ని దక్కించుకుంది. వుమెన్ సేఫ్టీలో అత్యంత భద్రత కలిగిన నగరంగా ముంబై మొదటి స్థానంలో నిలవగా.. ఢిల్లీ మహిళలకు అంత సేఫ్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు మహిళలు. దేశంలో మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరాలపై NARI (National Annual Report & Index on Women's Safety) 2025 సర్వే రిపోర్ట్ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ముంబై ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా.. విశాఖపట్నం మూడవ స్థానంలో ఉండటం విశేషం.
శనివారం (ఆగస్టు 30) ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్ పర్సన్ విజయ రహత్కార్ NARI–2025 రిపోర్టును విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 31 నగరాలలో మొత్తం 12,770 మంది మహిళలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం అత్యంత సేఫెస్ట్ సిటీలుగా.. ముంబై, కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్ టక్, ఈటానగర్ నిలిచాయి.
మరోవైపు కోల్ కతా, ఢిల్లీ, రాంచి, శ్రీనగర్, ఫరీదాబాద్, పాట్నా, జైపూర్ నగరాలు లిస్టులో బాటమ్ లో ఉన్నాయి. అంటే ఈ నగరాలు మహిళలకు భద్రతకు అంత సేఫ్ కాదనే అభిప్రాయం మహిళల్లో ఉంది. సర్వే ప్రకారం ముంబై సేఫెస్ట్ సిటీగా, ఢిల్లీ అన్ సేఫ్ గా లిస్టులో ఉన్నప్పటికీ.. అంత సేఫ్ కాదని 40 శాతం మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
8వ స్థానంలో హైదరాబాద్:
భద్రత విషయంలో హైదరాబాద్ నగరం కూడా సేఫ్ అనే అభిప్రాయం వ్యక్త పరిచారు మహిళలు. వుమెన్ సేఫ్టీలో 8వ స్థానం దక్కించుకోవడమే అందుకు ఉదాహరణ. సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మహిలలు భద్రత విషయంలో భాగ్యనగరం పర్లేదని చెప్పినట్లు సర్వే ద్వారా తెలుస్తోంది.
పగలు రాత్రి.. ఎంత తేడా
పగటి వేళల్లో, రాత్రి వేళల్లో మహిళా భద్రతపై భిన్నమైన సమాధానాలు వెల్లడించారు మహిళలు. డే టైమ్ లో.. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు సేఫ్ అని 86 శాతం మంది చెప్పారు. అదే రాత్రి అయ్యే సరికి పరిస్థితులు మారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజా రవాణా అంటే బస్సులు, ట్రైన్లు, ఆ తర్వాత ఖాళీగా ఉన్న వీధులు, హోటల్స్, షాపింగ్ మొదలైన స్థలాలు మహిళకు అంత సేఫ్ కాదని చెబుతున్నారు. ఇలాంటి ఏరియాల్లో మహిలలు చాలా తక్కువగా ఉంటున్నారని.. వాళ్లకు అవి అంత సేఫ్ కాదని తెలిపారు.
దాడులను మనసులోనే దాచుకుంటున్న మహిళలు:
మహిళా భ్రద్రతపై చేసిన సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై దాడి జరిగినప్పుడు లేదా అసభ్యకరంగా ప్రవర్తించిప్పుడు.. ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరు మనసులోనే దాచుకుంటున్నారట. పోలీసులకు గానీ, కొన్ని సార్లు ఇంట్లో వ్యక్తులకు కూడా చెప్పడానికి భయపడుతున్నారని రిపోర్టులో వెల్లడైంది. మూడో మహిళ మాత్రమే కంప్లైంట్ వరకు వెళ్తున్నారట.
దీనికి కారణం.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ.. త దుపరి పరిణామాలు. వీటికి తోడు సమాజంలో, ఇరుగుపొరుగు వాళ్లు చూసే విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ధైర్యం చేయడం లేదని తేలింది. అంటే మహిళలకు సాటి సమాజం ఈ విషయంలో ధైర్యం ఇవ్వలేక పోతోందని స్పష్టం అవుతోంది. షనల్ క్రైమ్ బ్యూరో వివరాలలో కూడా ఇవే గణాంకాలు వెల్లడైనట్లు ఛైర్ పర్సన్ విజయ రహత్కార్ తెలిపారు.
లా అండ్ ఆర్డర్ సమస్య ఒక్కటే కాదు:
ఈ సందర్భంగా రహత్కార్ మాట్లాడుతూ.. మహిళా భద్రత అనేదీ లా అండ్ ఆర్డర్ సమస్య ఒక్కటే కాదని.. ఆ కోణంలో చూడవద్దని చెప్పారు. వుమెన్ సేఫ్టీ అనేది విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, డిజిటల్ ఫ్రీడమ్, మహిళల ప్రయాణం మొదలైన అంశాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. షీ టీమ్స్, సీసీటీవీ, హెల్ప్ లైన్ నెంబర్లు మొదలైన వాటి ద్వారా వారిలో ధైర్యాన్ని నింపడం జరుగుతోందని.. ఇంకా చాలా మార్పు రావాల్సి ఉందని అన్నారు.