
Auto Driver Income: ఈరోజుల్లో లక్ష రూపాయలు నెలకు ఆదాయం వస్తేనే కానీ కనీసం ఉన్న ఖర్చులను తట్టుకోవటం అస్సలు కుదరదు. అందుకే చాలా మంది ఐటీ రంగంతో పాటు మెడికల్ ఫీల్డ్ మంచి ఆదాయాన్ని ఇస్తుందని అటుగా ప్రయాణిస్తున్నారు. కానీ ఎలాంటి డిగ్రీలు, ఎంబీయేలు లేని ఒక ఆటో డ్రైవర్ అన్న నెలకు తన ఆదాయం కనీసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలుగా ఉన్నట్లు బయటపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత మెుత్తంలో పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న ఆడిటర్లు, ఐటీ ఉద్యోగులు కూడా కష్టతరంగా ఉంది.
అయితే ఈ ఆటో డ్రైవర్ అన్న కనీసం తన ఆటోను కూడా నడపకుండానే లక్షల్లో ఆదాయం పొందుతున్నాడంటే మీరు నమ్ముతారా. ఔనండి బాబు ముంబైలోని యూఎస్ కౌన్సులేట్ బయటే ఉంటాడు ఈ భయ్యా. అతను ఎలాంటి యాప్స్, టెక్నాలజీ లేకుండా కేవలం ఎంబసీకి వచ్చేవారు లోపలికి వెళ్లేటప్పుడు తన ఆటోలో లగేజ్ పెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంటాడు. అంటే చిన్నపాటి క్లాక్ రూం సేవలు లాంటివనుకోండి. అతని పెట్టుబడి కేవలం నిజాయితీ, నమ్మకం మాత్రమే.
అక్కడ వీసా అపాయింట్మెంట్ కోసం వచ్చిన లెన్స్ కార్ట్ ప్రతినిధి రాహుల్ రూపాణి సెక్యూరిటీ వాళ్లు లగేజ్ లోనికి తీసుకురానివ్వకపోవటం గమనించి ఆలోచనలో ఉండగా.. సదరు ఆటో డ్రైవర్ తాన ఆటోలో బ్యాగ్ పెట్టుకుని వెళ్లొచ్చని చెప్పాడు. తాను రోజుకు బ్యాగ్ కి రూ.వెయ్యి ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే అక్కడ బ్యాగ్ పెట్టి పనిముగించుకుని వచ్చాక.. అసలు రోజు ఆదాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఆశ్చర్యపోయాడు రాహుల్.
యూఎస్ ఎంబసీ బయట రోజూ ఆటో పార్క్ చేసి ఇలా వీసా కోసం వచ్చేవారికి సేవలు అందిస్తూ రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పటంతో రాహుల్ అవాక్ అయ్యాడు. అంటే సగటున నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు.
అయితే తన ఆటోలో 30 బాగ్స్ పెట్టలేడు కాబట్టి స్థానిక పోలీసుతో కలిసి అతని వద్ద ఉన్న స్థలాన్ని వినియోగించుకుంటున్నాడు ఆటో డ్రైవర్. దీంతో నేరుగా పోలీసుల వద్దకు వారిని తీసుకెళ్లి వచ్చినవారికి తన సేవలను అందిస్తున్నాడు. పైగా పోలీసుల స్థలం కావటంతో పెట్టేవారికి కూడా నమ్మకం భద్రత గురించి అనుమానాలు ఉండవు. మన చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమే ఆదాయానికి మార్గం అని ఎలాంటి పెద్ద డిగ్రీలు లేని ఆటో అన్న వాస్తవంగా చేసి చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.