గట్టెక్కిన ముంబై.. 27 రన్స్‌ తేడాతో గుజరాత్‌పై గెలుపు

గట్టెక్కిన ముంబై.. 27 రన్స్‌ తేడాతో గుజరాత్‌పై గెలుపు
  • ఛేజింగ్‌లో హడలెత్తించిన రషీద్‌ ఖాన్‌
  • సూర్య కుమార్‌ సూపర్‌ సెంచరీ

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌లో మరో హై ఓల్టేజ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌. ముందుగా ‘మిస్టర్‌‌‌‌ 360’ సూర్యకుమార్‌‌‌‌ (49 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 103 నాటౌట్‌‌‌‌) సెంచరీతో వీరవిహారం చేస్తే.. ఛేజింగ్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌ రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 10 సిక్స్‌‌‌‌లతో 79 నాటౌట్‌‌‌‌) భారీ హిట్టింగ్‌‌‌‌తో ముంబైని హడలెత్తించాడు. ఓవర్లు పూర్తి కావడంతో ఊపిరి పీల్చుకున్న ముంబై శుక్రవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 27 రన్స్‌‌‌‌ తేడాతో గుజరాత్‌‌‌‌పై గెలిచింది.  టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. తర్వాత గుజరాత్‌‌‌‌ 20 ఓవర్లలో 191/8 స్కోరుకు పరిమితమైంది. మిల్లర్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 41) ఫర్వాలేదనిపించాడు. సూర్యకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

సూర్య మెరుపులు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ముంబైని రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (4/30) దెబ్బతీసినా.. సూర్యకుమార్‌‌‌‌ సెంచరీతో భారీ స్కోరు అందించాడు. రెండో ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌తో రోహిత్‌‌‌‌ (29) మెరుపు ఆరంభాన్నిస్తే, ఇషాన్‌‌‌‌ (31) కూడా ఫోర్లతో దాన్ని కొనసాగించాడు. ఈ ఇద్దరి ధాటికి పవర్‌‌‌‌ప్లేలో ముంబై 61/0 స్కోరు చేసింది. అయితే ఏడో ఓవర్‌‌‌‌లో రషీద్‌‌‌‌ డబుల్‌‌‌‌ ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో రోహిత్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 66/2గా మారింది. ఈ దశలో సూర్య ఓ ఎండ్‌‌‌‌లో భయంకరమైన హిట్టింగ్‌‌‌‌తో చెలరేగితే, రెండో ఎండ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌, ఫోర్‌‌‌‌తో జోరు చూపెట్టిన నెహాల్‌‌‌‌ వదేరా (15)ను రషీద్‌‌‌‌ బోల్తా కొట్టించాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై 96/3 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి విష్ణు వినోద్‌‌‌‌ (30)తో కలిసి సూర్య టైటాన్స్‌‌‌‌ బౌలర్లను ఊచకోత కోశాడు. జోసెఫ్‌‌‌‌ వేసిన 11వ ఓవర్‌‌‌‌లో చెరో సిక్స్‌‌‌‌, తర్వాత షమీ ఓవర్‌‌‌‌లో ఇద్దరు కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ దంచారు. దీనికి తోడు వికెట్ల మధ్య వేగంగా రన్స్‌‌‌‌ తీస్తూ గుజరాత్‌‌‌‌ ఫీల్డర్లకు పరీక్ష పెట్టారు. 15వ ఓవర్‌‌‌‌లో సూర్య 4, 6తో ముంబై స్కోరు 151/3కి పెరిగింది. 16వ ఓవర్‌‌‌‌లో మోహిత్‌‌‌‌ శర్మ (1/43) విష్ణును ఔట్‌‌‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌లో టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (5) పెవిలియన్‌‌‌‌కు వెళ్లినా.. ఆఖరి ఓవర్లలో సూర్య శివాలెత్తాడు. 18వ ఓవర్‌‌‌‌లో 4, 4, 6, 4తో 20 రన్స్‌‌‌‌, తర్వాతి ఓవర్‌‌‌‌లో 6, 4, 4తో 17 రన్స్‌‌‌‌, లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో రెండు భారీ సిక్సర్లతో 17 రన్స్‌‌‌‌ దంచాడు. ఈ క్రమంలో 49 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ చేయడంతో ముంబై భారీ టార్గెట్‌‌‌‌ నిర్దేశించింది. 

మిల్లర్‌‌‌‌, రషీద్‌‌‌‌ మెరిసినా..

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో గుజరాత్‌‌‌‌ టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ విఫలమైనా.. మధ్యలో మిల్లర్‌‌‌‌, చివర్లో రషీద్‌‌‌‌ భారీ హిట్టింగ్‌‌‌‌తో భయపెట్టారు. ఆరంభంలో సాహా (2), గిల్‌‌‌‌ (6), కెప్టెన్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ (4) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే ఔట్‌‌‌‌కావడంతో టైటాన్స్‌‌‌‌ 26/3తో కష్టాల్లో పడింది. విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ (29), మిల్లర్‌‌‌‌ పవర్‌‌‌‌ప్లేలో 48/3 స్కోరు అందించారు. అయితే ఏడో ఓవర్‌‌‌‌లో విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ను చావ్లా (2/36) ఔట్‌‌‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 22 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఐదు బాల్స్‌‌‌‌ తర్వాత అభినవ్‌‌‌‌ మనోహర్‌‌‌‌ (2) కూడా వెనుదిరగడంతో గుజరాత్‌‌‌‌ 55 రన్స్‌‌‌‌కే సగం టీమ్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు వచ్చేసింది. ఈ దశలో రాహుల్‌‌‌‌ తెవాటియా (14)తో కలిసి మిల్లర్‌‌‌‌ వేగంగా ఆడాడు. 9వ ఓవర్‌‌‌‌లో 6, 4, 4 దంచడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో టైటాన్స్‌‌‌‌ 82/5 స్కోరు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీ వరుస బాల్స్‌‌‌‌లో ఔట్‌‌‌‌కావడంతో జీటీ 100/7తో కష్టాల్లో పడింది. చివర్లో రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ భారీ హిట్టింగ్‌‌‌‌తో 21 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేశాడు. నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (1) ఫెయిలైనా, జోసెఫ్‌‌‌‌ (7 నాటౌట్‌‌‌‌)తో కలిసి టైటాన్స్‌‌‌‌ను గెలుపు అంచులదాకా తీసుకొచ్చి ఆగిపోయాడు.  

సంక్షిప్త స్కోర్లు

ముంబై:20 ఓవర్లలో 218/5 (సూర్య 103*, ఇషాన్‌‌‌‌ 31, రషీద్‌‌‌‌ 4/30). గుజరాత్‌‌‌‌: 20 ఓవర్లలో 191/8 (రషీద్‌‌‌‌ 79*, మిల్లర్‌‌‌‌ 41, ఆకాశ్‌‌‌‌ 3/31).