ముంబై మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ (MNS) అధినేత రాజ్ థాకరే విరుచుకుపడ్డారు. ముంబైని మహారాష్ట్ర నుండి వేరు చేసే కుట్ర జరుగుతోందని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముంబైలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీ నాయకుడు కె. అన్నామలైని టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపించారు.
ఒక ఇంటర్వ్యూలో బీజేపీ నేత అన్నామలై మాట్లాడుతూ.. ముంబై అనేది కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం కాదు, అదొక అంతర్జాతీయ నగరం అని అన్నారు. ముంబై బడ్జెట్ 75 వేల కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని, అందుకే దీనిపై కేంద్రం పట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మాటలు ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద దుమారాన్ని రేపాయి.
దింతో అన్నామలై మాటలపై రాజ్ థాకరే నిప్పులు చెరిగారు. అన్నామలై పేరును ఉద్దేశిస్తూ ఆయనను 'రస్మలై' అని ఎగతాళి చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడే వారు మహారాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. గతంలో బాలాసాహెబ్ థాకరే వాడిన హటావో లుంగీ, బజావో పుంగీ అనే నినాదాన్ని మళ్ళీ గుర్తు చేశారు. ముంబైలోని మరాఠీ ప్రజలను అణచివేసి, నగరాన్ని పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడానికి పెద్ద కుట్ర జరుగుతోందని రాజ్ థాకరే ఆరోపించారు.
రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆయన ఉద్దేశపూర్వకంగానే దక్షిణ భారతీయులను అవమానిస్తున్నారని చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజ్ థాకరే మాత్రమే కాకుండా సంజయ్ రౌత్ (శివసేన UBT), సుప్రియా సూలే (NCP) కూడా అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముంబై, మహారాష్ట్ర ఎప్పటికీ విడదీయరానివని స్పష్టం చేశారు.
