పట్టపగలు ఇంట్లోకి వచ్చి.. బంధించి.. రూ.55 లక్షలు దోపిడీ

పట్టపగలు ఇంట్లోకి వచ్చి.. బంధించి.. రూ.55 లక్షలు దోపిడీ

ముంబై.. ఈ పేరు వింటే ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. మాఫియా సైతం గుర్తుకొస్తుంది.. బడా బడా వ్యాపారవేత్తలకు అడ్డా.. ఈ ముంబై.. సిటీలోనే అత్యంత పాపులర్ ఏరియా అయిన కలాబాదేవి ప్రాంతంలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన దోపిడీ.. ఇప్పుడు.. ముంబైని షేక్ చేస్తుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సౌత్ ముంబైలోని కలాబాదేవి ఏరియాలో ఆదిత్య హైట్స్ అనే ప్రాంతంలో.. ఓ వ్యాపార వేత్త నివాసం ఉంటున్నాడు. 2023, డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం.. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. ముసుగులు ధరించి.. ఇంట్లోకి చొరబడ్డారు.. వస్తూ.. వస్తూనే.. ఒంటరిగా ఉన్న వ్యాపారవేత్తను బంధించి.. కుర్చీకి కట్టేశారు. తీవ్రంగా కొట్టారు. పీకపై కత్తి పెట్టారు. భయపడిన ఆయన.. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో చెప్పేశాడు. దోపిడీ దొంగలు లాకర్ ఓపెన్ చేసి.. 55 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. 

ఇంట్లోని 55 లక్షల రూపాయల డబ్బు దోచుకున్న దోపిడీదారులు.. ఆ తర్వాత అతన్ని అలాగే వదిలేసి.. ఇంట్లో నుంచి పారిపోయారు.. సాయంత్రం ఇంటికి వచ్చిన పని మనుషులు.. అతన్ని విడిపించారు. ఆ తర్వాత ఎల్టీ మార్గ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు వ్యాపారవేత్త. భద్రత, ఇతర కారణాలతో ఆ వ్యాపారి పేరు వెల్లడించలేదు పోలీసులు. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం ముంబై సిటీలోని.. ధనవంతులు ఉంటే ప్రాంతంలో జరిగిన ఈ తరహా దోపిడీ సంచలనంగా మారింది.

ఈ కేసులో  గుర్తు తెలియని వ్యక్తులపై ఎల్‌టీ మార్గ్ పోలీసులు ఐపీసీ 454, 392, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యాపారికి తెలిసిన వ్యక్తులే ఈ పని చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.