ముంబైలో కొత్త వేరియంట్ కేసు.. కరోనా ‘ఎక్స్ఈ’ కాదు

ముంబైలో కొత్త వేరియంట్ కేసు.. కరోనా ‘ఎక్స్ఈ’ కాదు
  • ముంబైలో కొత్త వేరియంట్ నమోదైందన్న అధికారులు
  • అది ఎక్స్ఈ కాదని జీనోమ్ టెస్ట్ లో తేల్చిన ఇన్సాకాగ్

న్యూఢిల్లీ: బ్రిటన్ లో గత జనవరిలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’.. మన దేశంలోకీ ఎంటరైందని, ముంబైలో ఈ వేరియంట్ కు చెందిన మొదటి కేసు నమోదైందని బుధవారం అధికారులు ప్రకటించారు. అయితే, ముంబై వ్యక్తికి సోకిన వేరియంట్ ఎక్స్ఈ కాదని జీనోమ్ టెస్ట్ లో తేలినట్లు సాయంత్రం ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కొవ్2 జీనోమిక్స్ కన్సార్షియం) ఓ ప్రకటనలో వెల్లడించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ఈ వేరియంట్ ఆనవాళ్లేమీ దొరకలేదని తెలిపింది. అంతకుముందు 230 శాంపిల్స్ కు టెస్ట్  చేయగా.. 228 శాంపిల్స్ ఒమిక్రాన్ వేరియంట్ గా, ఒకటి కప్పా, మరొకటి ఎక్స్ఈ వేరియంట్ గా తేలాయని ముంబై మున్సిపల్ అధికారులు ప్రకటించారు. వీరిలో చాలా మందికి ఎలాంటి రోగ లక్షణాలు లేవని, 21 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరినట్లు వెల్లడించింది. ఎక్స్ఈ వేరియంట్ గా తేలిన వ్యక్తి సౌత్ ఆఫ్రికా నుంచి ఫిబ్రవరిలో వచ్చారని తెలిపింది. దీంతో ఒమిక్రాన్ కన్నా చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తుందని చెప్తున్న ఎక్స్ఈ ముంబైలోకి ఎంటరైందని వార్తలు రావడం ఆందోళన కలిగించింది. అయితే, అది ఎక్స్ఈ వేరియంట్ కాదని ఇన్సాకాగ్ స్పష్టంచేసింది. 

బీఏ1, బీఏ2 కాంబినేషనే ఎక్స్ఈ

ఇప్పటివరకు వచ్చిన వైరస్ రకాల్లో అన్నింటికన్నా ఎక్స్ఈ వేరియంటే అత్యంత ఎక్కువ (బీఏ2 కంటే 10 శాతం) స్పీడ్​గా స్ప్రెడ్ అవుతుందని ఈ మధ్యే డబ్ల్యూహెచ్​వో హెచ్చరించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లయిన బీఏ1, బీఏ2 కాంబినేషన్ ద్వారా ఏర్పడినదే ఎక్స్ఈ వేరియంట్​అని బ్రిటన్ మెడికల్ జర్నల్ తెలిపింది. జనవరి నుంచి మొదలు ఇప్పటివరకు బ్రిటన్ లో ఎక్స్ఈ వేరియంట్ కేసులు 637కు చేరుకున్నాయి.