రాణా దంపతులకు సంబంధించిన వీడియో రిలీజ్

రాణా దంపతులకు సంబంధించిన వీడియో రిలీజ్

మహారాష్ట్ర : అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులకు సంబంధించిన వీడియోను ముంబై కమిషనర్ సంజయ్ పాండే రిలీజ్ చేశారు. కులం పేరుతో పోలీసులు తనను దూషించారని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు నవనీత్ కౌర్ రాణా లేఖ రాశారు. ఖార్ పోలీస్ స్టేషన్ లో తనను ఎస్సీ అని తిట్టారని, కనీసం బాత్ రూమ్ కూడా వాడుకోనివ్వలేదని... వాటర్ కూడా ఇవ్వలేదని పోలీసులపై ఆరోపణలు చేశారు. దీనిపై ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే... ఖార్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో సిబ్బంది ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాకు టీ, నీళ్లు ఇచ్చారు. రాణా దంపతులు వాటిని తీసుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కన్పించింది. రాణా దంపతులతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించలేదని ముంబై కమిషనర్ స్పష్టం చేశారు. 

అయితే.. నవనీత్ కౌర్ ఫిర్యాదు చేసింది ఖార్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనకు సంబంధించిన విషయంపై కాదని... శాంటాక్రూజ్ లో అని ఆమె తరపు న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామంటూ నవనీత్ కౌర్ రాణా దంపతులు సవాల్ విసిరారు. దీన్ని వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముందు నిరసనలు చేపట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా చేశారంటూ ఈనెల 23వ తేదీన రాణా దంపతులపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను రాణా దంపతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై దాడి చేశారని 24వ తేదీన రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజద్రోహం కేసులో బాంద్రా కోర్టు నవనీత్ కౌర్ దంపతులకు 2 వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హనుమాన్ చాలీసా వివాదంలో ప్రస్తుతం నవనీత్ కౌర్ రాణా దంపతులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు

నేనడిగే 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి