ఢిల్లీ దెబ్బకు ముంబై షేక్: ఎయిర్ పోర్టులో ఎక్కడికక్కడే నిలిచిన 210 విమానాలు

ఢిల్లీ దెబ్బకు ముంబై షేక్: ఎయిర్ పోర్టులో ఎక్కడికక్కడే నిలిచిన 210 విమానాలు

ముంబై: ఢిల్లీ ఎయిర్ పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ ప్రభావం దేశంలోని పలు విమానాశ్రయాలపై పడింది. ముఖ్యంగా నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు 220 విమానాలు ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయినట్లు సమాచారం.

ఫ్లైట్ డేటా ట్రాన్స్‌మిషన్‌కు సపోర్ట్ చేసే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో లోపం కారణంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో ఫ్లైట్ షెడ్యూల్‌లపై తీవ్ర ప్రభావం పడిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ధృవీకరించింది. ఏఎమ్ఎస్ఎస్ పని చేయకపోవడంతో మాన్యువల్‎గా ఆపరేషన్లు నిర్వహించడంతో ఎయిర్ పోర్టుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఫలితంగా ముంబై, ఢిల్లీ మధ్య నడిచే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలు క్యాన్సిల్ అయ్యాయి.

విమానాల ఆలస్యం, రద్దుతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే వెయిట్ చేయిస్తున్నారని సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ కూడా ఈ సమస్యలో చిక్కుకున్నాడు. ఈ మేరకు తన అసంతృప్తిని ఎక్స్‎లో పోస్ట్ చేశాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో నిరాశపరిచే అనుభవం ఎదురైందన్నారు. మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరాల్సిన విమానం 3.35 బయలుదేరుతోందని పేర్కొన్నాడు. ఇంత పేలవమైన నిర్వహణ ప్రయాణీకుల సమయం పట్ల గౌరవం లేకపోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విమానాల రద్దు, ఆలస్యంపై ఎయిర్ ఇండియా ప్రయాణికులకు కీలక సూచన చేసింది. ఏటీసీ కార్యకలాపాలను ప్రభావితం చేసే AMSS వ్యవస్థ సమస్య ఇంకా పరిష్కరించబడుతోందని తెలిపింది. సమస్య పూర్తిగా పునరుద్ధరించబడే వరకు ఢిల్లీ, ఉత్తర ప్రాంతంలోని కొన్ని విమానాశ్రయాలలో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని క్షమాపణ చెప్పింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది.