MI vs KKR: కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతున్న మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. కేకేఆర్ బౌలర్ల ధాటికి తలవొగ్గి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఒక దశలో తీవ్ర కష్టాల్లో పడ్డ ముంబైని చివర్లో కార్బిన్ బోష్ మెరుపులు ఆదుకున్నాయి.
ఆదిలోనే ముంబైకి షాక్!
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కెమరాన్ గ్రీన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ లైన్ వద్ద ఉన్న మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే వచ్చిన నమన్ ధీర్ (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. గ్రీన్ వేసిన అద్భుత బంతికి వికెట్ కీపర్ రఘువంశీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
వరుణుడి అంతరాయం:
మరో ఎండ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (15) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ.. సౌరభ్ దూబే వేసిన సూపర్ డెలివరీకి కెమరాన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (15) కొన్ని బౌండరీలతో విరుచుకుపడినప్పటికీ, సౌరభ్ దూబే వేసిన కిరాక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై 41 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది.
తడబడ్డ మిడిలార్డర్:
వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా, కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. రన్ రేట్ పెంచే క్రమంలో తిలక్ వర్మ (20) కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద అనుకూల్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (26) కాసేపు నిలకడగా ఆడినప్పటికీ.. సునీల్ నరైన్ వేసిన బ్రిలియంట్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ (14) వరుణ్ చక్రవర్తి వేసిన 18వ ఓవర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
చివరి ఓవర్లో కార్బిన్ బోష్ విధ్వంసం:
వరుసగా వికెట్లు పడుతున్నా.. చివర్లో క్రీజులోకి వచ్చిన కార్బిన్ బోష్ మాత్రం దుమ్మురేపాడు. చివరి రెండు ఓవర్లలో బౌండరీల వర్షం కురిపించి ముంబైకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ముఖ్యంగా కార్తీక్ త్యాగి వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో ముంబై బ్యాటర్లు 6, 6, 4, 2, 1 పరుగులతో చెలరేగడంతో ముంబై 147 పరుగుల మార్కును అందుకోగలిగింది. కేకేఆర్ బౌలర్లలో కెమరాన్ గ్రీన్, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి రెండేసి వికెట్లతో రాణించారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ ఈ 148 పరుగుల టార్గెట్ ఛేదించాల్సిందే.
