
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపు కాల్ వచ్చింది. ముంబై సిటీలో త్వరలో పెద్ద ఘోరం జరగబోతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు షోయబ్ అని వెల్లడించినట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన సామా అనే మహిళ, కాశ్మీర్‌కు చెందిన ఆసిఫ్ అనే వ్యక్తితో కలిసి త్వరలో ముంబైకి ఏదో పెద్ద ప్రమాదం తలపెట్టాలని ప్లాన్ చేసినట్లు షోయబ్ వివరించాడన్నారు.
అతను సామ, ఆసిఫ్ ఫోన్ నంబర్లను కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల కిందటే ముంబై పోలీసులకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని పేర్కొంటూ ఓ యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి బెదిరించాడు.