లాక్​డౌన్​లో ఉండే చాన్స్ మాకొస్తే..

లాక్​డౌన్​లో ఉండే చాన్స్ మాకొస్తే..
  • హ్యాపీగా ఇంట్లోవాళ్లతో గడుపుతం
  • ముంబై పోలీసుల వీడియో వైరల్

ముంబై: దేశవ్యాప్తంగా లాక్​డౌన్ తో చాలా మంది బోర్ కొడుతోందంటూ బయటికి వస్తున్న సీన్ లు కన్పిస్తున్నాయి. మరికొందరు పొద్దస్తమానం ఇంట్లో ఉండటం బోర్ కొడుతోందంటూ మెస్సేజ్ లు పెడుతున్నారు. కానీ, పోలీసులు, డాక్టర్లు, శానిటైజేషన్ వర్కర్లు మాత్రం ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. లాక్​డౌన్ పాటించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయండంటూ అవగాహన కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబై పోలీసులు బాలీవుడ్ రేంజ్ లో రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 21 రోజుల లాక్ డౌన్ తమకే గనుక అమలులోకి వస్తే మాత్రం ఇంట్లోంచి అడుగు బయటపెట్టబోమని, హ్యాపీగా తమ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతామని పోలీసు ఆఫీసర్లు చెప్పడం వీడియోలో కన్పిస్తుంది. ‘‘మా డిపార్ట్ మెంట్ కు లాక్ డౌన్ వర్తించే సందర్భం వస్తే హాయిగా పిల్లలు, పెట్స్ తో గడుపుతాను. హాయిగా నిద్రపోతా’’ అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పడం చూసేవాళ్లను ఆలోచింపజేస్తుంది.

ఫిల్మీ స్టైల్​లో సెలబ్రిటీల రెస్పాన్స్
ఈ వీడియోను ట్విట్టర్లో చాలా మంది సెలబ్రిటీలు షేర్ చేస్తూ సినిమాటిక్ వే లో పోలీసులకు, లాక్​డౌన్ లో డ్యూటీలో ఉన్న సిబ్బందికి థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రజలు ఇంట్లోనే సేఫ్ గా ఉంటూ లాక్​డౌన్ కి సపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. ముంబై సిటీని సేఫ్ గా ఉంచేందుకు కృషి చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి థ్యాంక్స్ అంటూ అజయ్ దేవగన్, ఆలియా భట్ వీడియోను రీట్వీట్ చేశారు. ‘‘మనల్ని సేఫ్ గా ఉంచేందుకు, మన కుటుంబాలను సురక్షితంగా ఉంచేందుకు పగలు రాత్రి పోలీసులు, సైన్యం పనిచేస్తోంది. వారందరికీ దిల్​సే థ్యాంక్యూ అని చెప్పండి. మనం చేయగలిగింది అదే’’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. షాహీద్ కపూర్ స్పందిస్తూ.. ‘మనమంతా ఇంట్లో ఉండటమే పోలీసులకు తెలిపే అతి పెద్ద మద్దతు’ అని ట్వీట్ చేశారు. అర్జున్ కపూర్, అభిషేక్ బచ్చన్ కూడా ట్వీట్ చేశారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండి సిటీలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.