
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి ముంబై పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 10న ఇంటరాగేషన్ కు రావాలంటూ సమన్లు జారీ చేశారు. మహారాష్ట్రలోని పాలగఢ్ లో ఇద్దరు సాధువుల హత్య వెనుక కాంగ్రెస్ ఉందంటూ అర్ణబ్ చేసిన వ్యాఖ్యలపై ముంబైలో గతంలో కేసు నమోదైంది. అలాగే ఏప్రిల్ లో ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికులు భారీగా గుమ్మిగూడిన ఘటన గురించి నిర్వహించిన డిబేట్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని వేర్వేరు స్టేషన్లలో పలువురు కేసులు పెట్టారు. వీటికి సంబంధించి అర్ణబ్ గోస్వామిని గత నెలలో విచారించిన పోలీసులు.. మరోసారి ఇంటరాగేషన్ కు రావాలని పిలిచారు. బాంద్రా రైల్వేస్టేషన్ ఘటనకు సంబంధించి తొలిసారి తాము అర్ణబ్ ను ఇంటరాగేషన్ కు పిలిచామని డిప్యూటీ కమిషనర్ ప్రణయ్ అశోక్ చెప్పారు. ఈ కేసులో అర్ణబ్ సహా రిపబ్లిక్ టీవీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎస్. సుందరం ను కూడా ఇంటరాగేషన్ కు పిలిచామన్నారు.
నాకు ప్రజల అండ ఉంది: అర్ణబ్
ఇంటరాగేషన్ కు హాజరవ్వాల్సిందిగా ముంబై పోలీసులు ఇచ్చిన నోటీసులపై అర్ణబ్ గోస్వామి స్పందించారు. పాలగఢ్, బాంద్రా ఘటనలపై వాస్తవాలనే తాము ప్రసారం చేశామని, అయితే సోనియా సేన ప్రభుత్వం, వాద్రా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలను ఆ నిజాలు దెబ్బ తీశాయని ఆయన చెప్పారు. తాను రేపు పోలీసుల విచారణకు హాజరవుతానని, తనపై నిజం ఉందని, భారత ప్రజలంతా తనకు అండగా ఉన్నారని అన్నారు. బాంద్రా ఘటనపై తమ కవరేజీ వల్ల కాంగ్రెస్ శాంతి భద్రతల సమస్యను సృష్టించకుండా అడ్డుకోగలిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమపై కక్ష గట్టుకుని పని చేస్తోందని, వారికి ఓటమి తప్పదని ఆయన అన్నారు.