సీరియల్ నటిని షాపు ఓపెనింగ్​కు పిలిచి..వ్యభిచారం చేయాలని ఒత్తిడి

సీరియల్ నటిని షాపు ఓపెనింగ్​కు పిలిచి..వ్యభిచారం చేయాలని ఒత్తిడి
  • డయల్ 100కు కాల్ చేసిన ముంబై సీరియల్ నటి
  • కాపాడిన మాసబ్ ట్యాంక్ పోలీసులు

మెహిదీపట్నం, వెలుగు: షాపు ఓపెనింగ్ కోసం ముంబైకి చెందిన సీరియల్ నటికి ఆమె స్నేహితులు ఫోన్ చేసి ఆహ్వానించారు. తీరా ఆమె ఇక్కడికొచ్చాక వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ ఘటన మాసబ్​ట్యాంక్ లో జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పరుశురాం వివరించారు. వెస్ట్ బెంగాల్​కు చెందిన ఓ యువతి నాలుగేండ్లుగా ముంబైలో ఉంటూ సీరియల్స్​లో నటిస్తున్నది. ఈ క్రమంలో ఆంధ్రాకు చెందిన గాయత్రి.. హైదరాబాద్​లో ఓ బట్టల షాపు ప్రారంభించేందుకు ఓ సినీ నటిని పంపించాలని ముంబైలోని తన మిత్రుడు పంకజ్​ను కోరింది. ఈ క్రమంలో షాపు ఓపెనింగ్ కోసం 18వ తేదీన సీరియల్ నటిని హైదరాబాద్​కు పంపించాడు. 

గాయత్రితో పాటు ఆమె ఫ్రెండ్ అయిన మరో మహిళతో మాసబ్​ట్యాంకులోని ఓ అపార్ట్​మెంట్​లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 21వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో గాయత్రితో పాటు ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ సినీ నటి రూమ్​కు వచ్చారు. వ్యభిచారం చేయాలంటూ నటిపై ఒత్తిడి చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో దాడి చేశారు. గట్టిగా అరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వెంటనే సినీ నటి డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను విడిపించారు. నటి ఫిర్యాదు మేరకు కేసు 
నమోదు చేసిన పోలీసులు.. రెండు టీమ్​లుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.