మాలెగావ్‌‌‌‌ పేలుడు కేసులో ఆ ఏడుగురూ నిర్దోషులే : మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌‌‌‌

మాలెగావ్‌‌‌‌ పేలుడు కేసులో ఆ ఏడుగురూ నిర్దోషులే : మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌‌‌‌
  • 17 ఏండ్ల తర్వాత ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు
  • నిందితుల్లో మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌‌‌‌ 

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మాలెగావ్‌‌‌‌ పేలుడు కేసులో నిందితులు ఏడుగురు నిర్దోషులేనని ముంబై ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. నిందితుల్లో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, లెఫ్టినెంట్‌‌‌‌ కర్నల్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ పురోహిత్‌‌‌‌ సహా ఏడుగురూ నిర్దోషులేనని ప్రకటించింది. ఈ మేరకు 17 ఏండ్ల తర్వాత ఎన్‌‌‌‌ఐఏ కోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. నిందితులను దోషులుగా నిర్ధారించేందుకు నమ్మదగిన, బలమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. పేలుడుకు బాధ్యులెవరనేదానిపై కేవలం అనుమానాలు సరిపోవని ఎన్‌‌‌‌ఐఏ కోర్టు అభిప్రాయపడింది. నిందితులపై ఉన్న ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌‌‌‌ విఫలమైందని పేర్కొంది.

అనుమానాల ఆధారంగా దోషులను తేల్చలేం 

మహారాష్ట్ర మాలెగావ్‌‌‌‌ ప్రాంతంలోని ఒక మసీదు వద్ద 2008 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 29న పేలుడు సంభవించింది. మోటార్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో ప్రజ్ఞాఠాకూర్‌‌‌‌‌‌‌‌, పురోహిత్‌‌‌‌తోపాటు అప్పటి ఆర్మీ మేజర్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌ ఉపాధ్యాయ్‌‌‌‌, అజయ్‌‌‌‌ రహిర్కర్‌‌‌‌‌‌‌‌, సుధాకర్‌‌‌‌‌‌‌‌ ద్వివేది, సుధాకర్‌‌‌‌‌‌‌‌ చతుర్వేది, సమీర్‌‌‌‌‌‌‌‌ కులకర్ణి ప్రధాన నిందితులుగా ఉన్నారు. మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌‌‌‌ కేసును దర్యాప్తు చేసి 2011లో ఎన్‌‌‌‌ఐఏకు బదిలీ చేసింది.

 ప్రస్తుతం తీర్పు వెలువరించిన ఎన్‌‌‌‌ఐఏ స్పెషల్‌‌‌‌ జడ్జి జస్టిస్‌‌‌‌ ఏకే లహోటి.. ప్రాసిక్యూషన్‌‌‌‌ జరిపిన దర్యాప్తులో అనేక లోపాలను ఎత్తిచూపారు. టెర్రరిజానికి మతం లేదని, నైతిక కారణాలు, అనుమానాల ఆధారంగా నిందితులను దోషులుగా నిర్ధారించలేమని అన్నారు. కీలక నిందితుడైన పురోహిత్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌డీఎక్స్‌‌‌‌ తీసుకువచ్చినట్లు, బాంబు తయారు చేసినట్లు ఎలాంటి ప్రూఫ్స్‌‌‌‌ లేవన్నారు. బాంబు అమర్చిన మోటార్‌‌‌‌‌‌‌‌ సైకిల్‌‌‌‌ ప్రజ్ఞా ఠాకూర్‌‌‌‌‌‌‌‌దేనని నిరూపించలేకపోయారని, అసలు బైక్‌‌‌‌కు అమర్చిన బాంబు పేలినట్లు కూడా రుజువుల్లేవని జడ్జి పేర్కొన్నారు. 

పేలుడుకు రెండేండ్ల ముందే ప్రజ్ఞా ఠాకూర్‌‌‌‌‌‌‌‌ సన్యానిగా మారారని, అప్పుడే ఆమె తనకు చెందిన అన్ని వస్తువులను వదిలేశారని జడ్జి పేర్కొన్నారు. ఉపా నిబంధనలు కూడా ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేస్తూ, పేలుడులో చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే బెయిల్‌‌‌‌ మీదున్న ఏడుగురు నిందితులు తీర్పు సందర్భంగా భారీ భద్రత నడుమ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఈ కేసులో ఇప్పటివరకు 323  మంది సాక్షులను విచారించి వాంగ్మూలాలు రికార్డు చేసింది.

మరి.. చంపినోళ్లెవరు?: అసదుద్దీన్  

మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులంతా నిర్దోషులే అయితే ఆ ఆరుగురిని ఎవరు చంపినట్టు.. అని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ముంబై కోర్టు తీర్పు నిరాశ కలిగించిందని, మాలెగావ్ పేలుళ్ల బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి మతం పేరుతో జరిగిన దారుణమైన ఘటన అని, బాధ్యులైన వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం న్యాయసమ్మతం కాదన్నారు. సాక్ష్యాధారాలు లేనందున నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక ఉద్దేశపూర్వకంగా నిర్వహించిన విచారణ, ప్రాసిక్యూషన్ ఉన్నాయన్నారు. ఈ  తీర్పుపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు.

నా 17 ఏండ్ల జీవితం నాశనం: ప్రజ్ఞా ఠాకూర్‌‌‌‌‌‌‌‌

కోర్టు తీర్పు అనంతరం ప్రజ్ఞా ఠాకూర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ హిందూత్వం గెలిచిందని అన్నారు. కుట్రలు పన్ని తన 17 ఏండ్ల జీవితాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. దేవుడే వాళ్లను శిక్షస్తాడని చెప్పారు. ఇదొక చరిత్రాత్మక రోజు అంటూ కోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అప్పటి కాంగ్రెస్‌‌‌‌ సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించింది. కాంగ్రెస్‌‌‌‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌‌‌‌ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేసింది. కాగా, కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌‌‌‌ చేస్తామని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.