
ముంబైలో లోన్ యాప్ వేధింపులకు మరో మహిళా బలైంది. ఏకంగా ఆమె మార్ఫింగ్ ఫోటోలను ఆమె బంధువులు, ఫ్రెండ్స్ కే షేర్ చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముంబైలోని జోగేశ్వరి వెస్ట్‌కు చెందిన ఓ మహిళా డబ్బులు అవసరం ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాష్ లోన్ అనే మొబైల్ యాప్ యాడ్ చూసి డౌన్‌లోడ్ చేసుకుంది. తరువాత ఆమె పర్సనల్ వివరాలు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి రూ.2,000 లోన్ కోసం అప్లయ్ చేసుకుంది. కానీ ఆమెకు కేవలం రూ.1,300 మాత్రమే వచ్చాయి.
లోన్ టైం గడవక ముందే లోన్ యాప్ ఉద్యోగి అంటూ ఒక వ్యక్తి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. వెంటనే డబ్బు కట్టకపోతే ఆమె మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దింతో భయపడి పోయిన మహిళ లోన్ యాప్ ద్వారా సందేశ్ కుమార్ అనే వ్యక్తికి రూ.2,000 పంపింది. అయినా ఒక గంట తర్వాత ఆమె మార్ఫింగ్ చేసిన ఫోటోలు గుర్తు తెలియని నంబర్ నుండి వాట్సాప్‌లో ఆమె అత్తకు పంపించారు. అలాగే నిమిషాల వ్యవధిలోనే ఆ ఫోటోలు ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ కి కూడా వెళ్లాయి.
ఏం చేయాలో తెలియక ఆ మహిళ చివరికి తన తండ్రిని ఆశ్రయించింది. తండ్రి సహాయంతో పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు మహిళ మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించారని ఆరోపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.