పాలమూరుకు రూ.883 కోట్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్కు రూ.603 కోట్లు

పాలమూరుకు రూ.883 కోట్లు..  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్కు రూ.603 కోట్లు
  • వాటర్​ సప్లై అభివృద్ధికి రూ.220 కోట్లు కేటాయింపు
  • నగరంలో కొత్తగా 15 తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి చర్యలు
  • 60 డివిజన్​ల పరిధిలో సీవర్​ లైన్​ నిర్మాణానికి త్వరలో టెండర్లు

మహబూబ్​నగర్, వెలుగు:పాలమూరు కార్పొరేషన్​కు భారీగా నిధులు మంజూరయ్యాయి. అర్బన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.883 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.603 కోట్లతో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ స్కీమ్​కు (యూడీఎస్​), రూ.220 కోట్లు వాటర్​ సప్లై అభివృద్ధికి ఖర్చు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద రూ.220 కోట్లలో రూ.60.1 కోట్లు, రూ.603 కోట్లలో రూ.172.68 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే వాటర్​ సప్లై ఇంప్రూవ్​మెంట్​ స్కీమ్​కు సంబంధించిన పనులకు టెండర్లు పూర్తి కాగా.. యూడీఎస్​కు సంబంధించి త్వరలో టెండర్లు పిలువనున్నారు.

తాగునీటి పైపులైన్​ మాదిరిగా సీవర్​ లైన్​

మహబూబ్​నగర్​ నగరంలోని పెద్ద చెరువుకు గతంలో నాలాల ద్వారా పెద్ద మొత్తంలో మురుగు నీరు వచ్చి చేరేది. దీంతో చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం కంపు వాసన వచ్చేది. అయితే కొద్ది రోజులుగా ఈ మురుగు చెరువులోకి రాకుండా నీటిని బైపాస్​ చేస్తున్నారు. ఈ బైపాస్​ చేసిన నీటిని శుద్ధి చేయడానికి రెండేళ్ల కిందట అమృత్​ స్కీమ్​ కింద సీవరేజ్  ట్రీట్​మెంట్​ ప్లాంట్ మంజూరైంది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రీట్​మెంట్​ ప్లాంట్​కు సీవర్​ లైన్​ ద్వారా మురుగు నీటిని తరలించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం నగరంలో ఓపెన్​ డ్రైనేజీల ద్వారా నీరు వస్తోంది. ఈక్రమంలో ప్రస్తుతం మంజూరైన రూ.603 కోట్లతో సీవర్​ లైన్​ ఏర్పాటు చేయనున్నారు. 

ఇందుకుగాను  నగరాన్ని నాలుగు జోన్లుగా డివైడ్​ చేశారు. ఇందులో మూడు జోన్లు నగరంలో, మరో జోన్  నగరం బయట ఉంటుంది. ఎర్రకుంట, గోల్​ మసీద్​ ప్రాంతాన్ని ఒక జోన్​గా, పెద్ద చెరువు ప్రాంతాన్ని మరో జోన్​గా, శ్రీనివాస కాలనీ ఏరియాను ఇంకో జోన్​గా, మయూరి పార్క్​, కొత్త కలెక్టరేట్​ ప్రాంతాన్ని ఇంకొక జోన్​గా డివైడ్​ చేశారు. ఇందులో మయూరి పార్క్​, కొత్త కలెక్టరేట్​ జోన్​ నగరం బయట ఉంటాయి. మిగతా మూడు జోన్లు నగరం లోపల ఉంటాయి. ఈ నాలుగు జోన్ల పరిధిలోని 60 డివిజన్లలో సీవర్​ లైన్​ను ఏర్పాటు చేయనున్నారు. 

210 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్​ పైప్​లైన్..​

రానున్న 15 ఏండ్ల వరకు నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు యూఐడీఎఫ్​ ద్వారా రూ.220 కోట్లను కేటాయించారు. 3 లక్షల జనాభాకు సరిపడా నీటిని అందించేందుకు ఈ నిధులతో తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చనున్నారు. ప్రస్తుతం నగరంలో 28 తాగునీటి ట్యాంకులు ఉండగా.. వీటి సామర్థ్యం 2.85 కోట్ల లీటర్లు.  అయితే అదనంగా 1.50 కోట్ల లీటర్ల కెపాసిటీ ఉన్న 15 కొత్త ట్యాంకులను నిర్మించనున్నారు. 

ఈ ట్యాంకులను వీరన్నపేట డబుల్​ బెడ్రూమ్​ కాలనీ, హనుమాన్​పుర, పాత డీఎంహెచ్​వో ఆఫీస్, కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్, ఇండస్ట్రియల్​ ఏరియా, రామయ్యబౌలి, తిరుమల హిల్స్, మర్లు బైపాస్, ఏనుగొండ, టీచర్స్​ కాలనీ, మెట్టుగడ్డ, జైనల్లీపూర్​ వద్ద నిర్మించనున్నారు. మరో మూడు ట్యాంకులను ఎక్కడ నిర్మించాలనే దానిపై సర్వే చేస్తున్నారు. ఈ 15  ట్యాంకులకు నీటిని అందించడానికి 26 కిలోమీటర్ల మేర ఫీడర్​ మెయిన్​ పైప్​లైన్​ను వేయనున్నారు. అలాగే 210 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్​ పైప్​లైన్​ వేయనున్నారు. ఈ లైన్​ ద్వారా కొత్తగా పది వేల కనెక్షన్లు ఇవ్వనున్నారు.

రూ.603 కోట్లతో అండర్  గ్రౌండ్  డ్రైనేజీ: ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్‌‌‌‌నగర్   నగరాన్ని అన్నిరంగాల్లో మొదటి స్థానంలో ఉంచడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం కాంగ్రెస్  ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. నగరంలో అండర్  గ్రౌండ్  డ్రైనేజీని డెవలప్​ చేసేందుకు రూ.603 కోట్లతో చేపట్టే భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నేషనల్  హౌసింగ్  బ్యాంకింగ్  రూ.430.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 172.68 కోట్లు ఈ ప్రాజెక్టు కింద మంజూరైనట్లు తెలిపారు. 

త్వరలో టెండర్  ప్రక్రియ ప్రారంభమవు తుందన్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తానని తెలిపారు. తాను రూ.వెయ్యి కోట్ల నిధులు మహబూబ్‌‌‌‌నగర్  అభివృద్ధికి తెచ్చానని, గతంలో ఈ స్థాయిలో ప్రాజెక్టులు తెచ్చినట్లు నిరూపించుకోవాలని సవాల్  విసిరారు. లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, ఎన్పీ వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, సీజే  బెనహర్  పాల్గొన్నారు.