- ఇద్దరు గుత్తేదారులతో బిడ్ ఖరారు
- రెండు, మూడు రోజుల్లో అగ్రిమెంట్
- 4.29 కోట్లకు గాను 2.49 కోట్ల చేప పిల్లలే పంపిణీ
- వచ్చే నెల మొదటి వారంలోగా జలాశయాల్లో విడుదల
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో చేపల పంపిణీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. జిల్లాలో చేప పిల్లల పంపిణీ బిడ్లను దాఖలు చేసేందుకు ఇద్దరు కాంట్రాక్టర్లు ముందుకువచ్చారు. జగిత్యాల, మహబూబాద్ జిల్లాలకు చేప పిల్లల పంపిణీ టెండర్ ను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మల్ జిల్లాలో 50 శాతం చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించి బిడ్ ను అంగీకరించారు.
దీంతో రెండు మూడు రోజుల్లో గుత్తేదారులతో మత్స్యశాఖ అధికారులు అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. కాగా జిల్లాకు 4.29 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా.. కేవలం 2.49 కోట్ల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసేందుకు అంగీకరించారు. దీంతో మత్స్యశాఖ అధికారులు ఈ చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా చేప పిల్లల పంపిణీ మొదలు కాబోతుండడంతో మత్స్యకార కుటుంబాలు ఊరట చెందుతున్నాయి.
రెండో దశలో 1.80 కోట్ల చేప పిల్లలు
జిల్లాలో 50 శాతం చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఇద్దరు గుత్తేదారులు ముందుకు రావడంతో ఈ అగ్రిమెంట్ ప్రక్రియను పూర్తిచేసుకొని యుద్ధ ప్రాతిపదికన చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల మొదటి వారం పది రోజుల్లోగా జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులు, 550కి పైగా చెరువుల్లో మొత్తం 2.49 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 1.80 కోట్ల చేప పిల్లలను రెండో దశ కింద జలాశయాల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండో దశ పంపిణీ కోసం గుత్తేదారులను కోసం అన్వేషించనున్నారు.
జిల్లాలో 222 మత్స్య సహకార సంఘాలు
స్వర్ణ, గడ్డన్న వాగు, కడెం ప్రాజెక్టు లతోపాటు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోని సగభాగం నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌లోనే అత్యధికంగా మొత్తం 222 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 13,129 మంది సభ్యులున్నారు. వీరితోపాటు మరో 7 వేల మంది కూడా చేపల వేట పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 76 మత్స్య సహకార సంఘాలు ఉండగా వీటిలో 4750 మంది సభ్యులున్నారు. జిల్లాలో 224 చెరువులున్నాయి. మంచిర్యాల జిల్లాలో 65 మత్స్య సహకార సంఘాల్లో 2762 మంది సభ్యులున్నారు. జిల్లాలో 390 చెరువులు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 127 మత్స్య సహకార సంఘాల్లో 7350 మంది సభ్యులున్నారు. 276 చెరువులు ఉన్నాయి.
మూడు నెలలు ఆలస్యం.. ఆందోళనలో 20 వేల కుటుంబాలు
జిల్లాలో మొత్తం 20వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. మత్స్యకారులకు ఉపాధి కోసం ఏటా ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అయితే ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలల్లోనే చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మొదలయ్యేది. ఈసారి మాత్రం మూడు నెలలు ఆలస్యమవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. గతేడాది సైతం 50 శాతమే పంపిణీ చేయగా.. ఈసారి ఎలాగైనా మొత్తం పిల్లలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ మూడు నెలలు ఆలస్యమైంది.
