46 ఏండ్ల తర్వాత ముంబైలో భారీ వర్షం

46 ఏండ్ల తర్వాత ముంబైలో భారీ వర్షం
  • రోడ్లు, ఇళ్లలోకి భారీగా చేరిన వరదనీరు
  •  దెబ్బతిన్న స్టేడియం, లోకల్‌ రైళ్లు క్యాన్సిల్‌

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వరదలు ముంచెత్తుతున్నాయి. కేవలం సీజన్‌ మొత్తం నమోదవ్వాల్సిన వర్షపాతం 12 గంటల్లోనే పడిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు చెప్పారు. మరో 24 గంటలు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. భారీ ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దాదాపు 46 ఏండ్ల తర్వాత ఆగస్టు నెలలో ఇంత భారీ వర్షాలు కురిసాయని ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐఎమ్‌డీ) అధికారులు వెల్లడించారు. బుధవారం 215.88 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఈస్ట్రన్‌ సబ్‌అబర్స్‌లో 101.9 మి.మీ. , వెస్ట్రన్‌ సబ్‌ అర్బ్‌లో 76.03మి.మీ. వర్షపాతం నమోదైందని అన్నారు. భారీ వర్షాలకు రోడ్లు, రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో లోకల్‌ ట్రైన్‌లో ఇరుక్కున్న 300 మంది ప్యాసింజర్లను ఎన్డీఆర్‌‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. భారీ వర్షాలకు డీవై పాటిల్‌ స్టేడియం దెబ్బతినింది. ముంబైలోనే కాకుండా మహారాష్ట్రలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలోని కొన్నిజిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబైలోని పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. మహారాష్ట్రను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు చెప్పారు. జనం అంతా ఇళ్లలోనే ఉండాలని, ఏదైనా పని ఉంటే తప్ప ఎవరూ బయటకి రావొద్దని అన్నారు. జాగ్రత్తలు తీసుకుని ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.