మున్సిపల్ క్వార్టర్లకు…బేరం పెడుతున్రు

మున్సిపల్ క్వార్టర్లకు…బేరం పెడుతున్రు

నందికొండ మున్సిపాలిటీలోని 1,091 క్వార్టర్లు అమ్మాలని నిర్ణయం

ఇరిగేషన్​ డిపార్ట్ మెంట్ పరిధిలోని ఆస్తులన్నీ మున్సిపాలిటీకి ట్రాన్స్ ఫర్

ఆర్ డబ్ల్యు ఎస్ కు తాగునీటి సరఫరా బాధ్యతలు

మున్సిపాలిటీకి శానిటైజేషన్, స్టీట్ లైట్ల వెయింటెనెన్స్

క్వార్టర్స్ వేలాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు

నల్గొండ, వెలుగు: నందికొండ మున్సిపాలిటీలో సరికొత్త వివాదానికి తెర లేచింది. నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్ పరిధిలోని క్వార్టర్స్​ తమకే దక్కుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. ఎవరూ ఊహించని రీతిలో క్వార్టర్స్ ​ను వేలం వేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో అరవై ఏళ్లుగా అక్కడ ఉంటున్న కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్​ ఎన్నికల నాటి హామీని విస్మరించి క్వార్టర్స్​ ను బేరం పెట్టాలనుకోవడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

వేలం వేయాలనే డిసైడ్​

నందికొండ మున్సిపాలిటీగా మారాక తమ కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలకు క్వార్టర్స్ బేరం పెడతారనే వార్త మింగుడు పడడం లేదు. మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల హామీ మేరకు ఎవరైతే క్వార్టర్స్ ​లో ఉంటున్నారో వాళ్లకే ఇండ్లు అలాట్​ చేయిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం సీన్​ రివర్స్​ అయింది. క్వార్టర్స్ ​ను అమ్మేసేందుకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం 1,351 క్వార్టర్లు
ఉన్నాయి. ఇందులో 260 క్వార్టర్లు ఎన్ ​ఎస్పీ స్టాఫ్​కు వదిలేసి, మిగిలిన 1,091 క్వార్టర్స్​కు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. టెండర్లు పిలిచే అధికారాన్ని కలెక్టర్​కు అప్పగించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి అక్కడే ఉంటున్న వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

గతంలోనే వ్యతిరేకించిన ప్రజలు

క్వార్టర్స్ ​ను విక్రయించే ప్రయత్నాలు గత ప్రభుత్వంలోనూ జరిగాయి. ఏ, బీ కేటగిరీలోని క్వార్టర్లు విక్రయించడానికి హిల్​కాలనీలోని భూమికి గజం రూ.750, పైలాన్​ కాలనీలోని భూమికి రూ.500 ఫిక్స్​ చేశారు. కానీ స్థానిక ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీ, డీ కేటగిరీలోని క్వార్టర్స్​ను సాధారణ రేట్లకే ఇవ్వాలని స్థానికులు డిమాండ్​ చేశారు. దీంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక గజం రూ. 3 వేల చొప్పున ఫిక్స్ చేశారు. ఏ కేటగిరీలోని క్వార్టర్స్​ ధర రూ.1.70 లక్షలు, బీ టగిరీ క్వార్టర్స్​ రూ.1.60 లక్షల చొప్పున నిర్ణయించారు. ఈ రేటుకు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి క్వార్టర్స్​ లో ఉంటున్నామని, తమకు నామినల్​ రేట్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. పైగా సాగర్​ డ్యాం నిర్మాణ
సమయంలో తాత్కాలికంగా నిర్మించిన క్వార్టర్లు, స్టోన్స్​ క్వారీ  దగ్గర నిర్మించిన కాలనీలు నామరూపాలు లేకుండా పోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు చెల్లించిన కిరాయిలే లక్షల్లో ఉంటాయని స్థానికులు చెప్తున్నారు.

టెండర్లు పిలిస్తే అంతే…

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాదని ఇటీవల కొందరి కౌన్సిలర్లకు ఇండ్లు అలాట్​ చేశారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే క్వార్టర్స్​ ను వేలం వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారపార్టీ నేతలు సైతం అవాక్కయ్యారు. టెండర్లు పిలిస్తే గొడవలు జరిగే ప్రమాదం ఉందని, దీనికి బదులు గజానికి ఇంత రేటు ఫిక్స్​ చేస్తే బాగుండేదని అంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు.

మున్సిపాలిటీకి బదలాయింపు

ఇరిగేషన్​ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉన్న తాగునీటి సరఫరా వ్యవస్థను ఆర్​ డబ్ల్యూఎస్ ​కు అప్పగించారు. ఇతర మున్సిపాలిటీల్లో మాదిరే ఇక్కడ కూడా వాటర్​ సప్లై చేస్తారు. హిల్​ కాలనీ, పైలాన్​ కాలనీలోని 7 ఎంఎల్ ​డీ వాటర్​ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఆర్ డబ్ల్యూఎస్​ పర్యవేక్షణలోకి వెళ్తుంది. అన్ని కాలనీల్లో పారిశుద్ధ్యం, శానిటైజేషన్​, వీధిలైట్ల మెయింటెనెన్స్ ను మున్సిపాలిటీ పరిధిలోకి మార్చారు. దీంతో పాటు ఆరు ఎకరాల నెహ్రూ పార్కు, ఐదు ఎకరాల ఎస్​ బీ హెచ్​ పార్కు ను ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుంచి తొలగించారు. సీసీ రోడ్లు 22.91 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 25.7 కిలోమీటర్లు, ఇంటర్నల్​ రోడ్లు 48.76 కిలోమీటర్లను మున్సిపాలిటీకి బదలాయించారు.