నర్సాపూర్, వెలుగు: ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాజీనామా చేస్తేనే నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ అన్నారు. గురువారం ఆయన నర్సాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తోందని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నర్సాపూర్‌కు ఉప ఎన్నిక వస్తుందని, తద్వారా నియోజకవర్గానికి ఫండ్స్ వస్తాయన్నారు. ఉప ఎన్నికల్లో మళ్లీ మదన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సునీతా రెడ్డి హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సీఎంకు సన్నిహితుడిని అని చెప్పుకుంటున్నా, నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్ నర్సాపూర్ లో కుర్చీ వేసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పి చేసిందేమీ లేదన్నారు.
సంగారెడ్డి కోర్టులో ఫ్రీ హెల్త్ క్యాంపు
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: ప్రస్తుత కాలంలో ఆరోగ్యవంతుడే సంపన్నడని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి కోర్టు సముదాయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమీర్ పేట అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ వారిచే ఫ్రీ హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపులో బీపీ, షుగర్, ఈసీజీ ,2డీ ఎకో, బీ ఎండీ టెస్ట్‌లు చేసి, వైద్య సలహాలు అందించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సభ్యులు రవీందర్, అమర్నాథ్ గౌడ్, ఆర్థోపెడిక్ సర్జన్ నవీన్ చందర్ రెడ్డి, కార్డియాలజిస్ట్ టిప్పుసుల్తాన్, గైనకాలజిస్ట్ నేహ సింగ్, మెడికల్ ఆఫీసర్ సుమాలిక తోపాటు న్యాయవాదులు పాల్గొన్నారు.
బీజేపీలోకి శ్రీరాంచక్రవర్తి
సిద్దిపేట, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బి. శ్రీరాంచక్రవర్తి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరాంచక్రవర్తికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుస్నాబాద్‌లో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని ఈ సందర్బంగా జేపీ నడ్డా సూచించారు.
శానిటేషన్‌పై దృష్టి సారించాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రతి పంచాయతీలో పల్లె ప్రగతి ఫలితాలు కనిపించాలని, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శరత్ సంబంధిత ఏపీవోలకు ఆదేశించారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో డీఎల్పీవోలు, ఆర్డీవోలు, ఎంపీవోలతో శానిటేషన్, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు.. తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజూ ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలన్నారు. రివ్యూలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీపీవో సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డివిజన్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌తోపాటు ఎస్పీ రమణకుమార్ పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు.
తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వాపస్
రామచంద్రాపురం, వెలుగు: మూడు నెలల కింద రాజీనామా చేసిన తెల్లాపూర్మున్సిపల్చైర్పర్సన్లలిత గురువారం తన రాజీనామాను వాపస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు తనపై ఆరోపణలు చేశారని అందుకే మేలో తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఈ మూడు నెలల్లో గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చానని అందుకే రాజీనామా వాపసు తీసుకున్నట్లు చెప్పారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి ఐదెకరాల స్థలం, మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాల్, వెజ్-, నాన్ వెజ్ మార్కెట్ శాంక్షన్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లచ్చిరాం నాయక్, బాబ్జీ, నాగరాజు పాల్గొన్నారు.
గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: గిరిజనుల సంస్కృతికి తీజ్ పండుగ ప్రతీక అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు తమ సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. యువతులు, మహిళలు డ్యాన్స్‌లతో అలరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత, వైస్ చైర్పర్సన్ అనిత, ఎంపీపీ మానస, జడ్పీటీసీ మంగ పాల్గొన్నారు.
దోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా మాసాయిపేట మండలకేంద్రం శివారులో నేషనల్హైవే 44 పై ఈనెల 21న జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని గురువారం కేసు వివరాలను వెల్లడించారు. ఇనుప స్ర్కాప్లోడుతో వెళ్తున్న డీసీఎంను దొంగలు చోరీ చేశారు. ఈ స్ర్కాప్విలువ రూ.7.80 లక్షలు ఉంటుందని ఎస్పీ చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి చోరీకి గురైన డీసీఎం, దొంగలు ప్రయాణించిన ఇన్నోవా కారు మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. 24న సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు చెందిన షేక్ అక్బర్, ఫకీర్ సోహెల్, సయ్యద్ జావీద్, మహ్మద్‌జాఫర్, సయ్యద్ షోయబ్ హష్మీ, మహ్మద్వహీద్ లను అరెస్ట్ చేసి, డీసీఎం, ఇన్నోవా కారు, నాలుగు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
బాధితులకు ‘భరోసా’
సిద్దిపేట రూరల్, వెలుగు: లైంగిక దాడులకు గురైన బాధితులకు పోలీస్భరోసా సెంటర్పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీపీ ఎన్. శ్వేత అన్నారు. భరోసా సెంటర్మహిళలు, బాలలకు రక్షణ, సత్వర సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై కమిషనరేట్‌లో గురువారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భరోసా సెంటర్ సేవల కోసం డయల్ 100, సిద్దిపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 నంబర్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ఏబీ దుర్గ, మహిళ ఎస్ఐ స్రవంతి, సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆడ బిడ్డలకు అండగా కేసీఆర్: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కోహెడ(బెజ్జంకి), వెలుగు: పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మి పథకంతో సీఎం కేసీఆర్అండగా నిలుస్తున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని గాగిల్లపూర్, గుగ్గిళ్ల, దాచారం, బెజ్జంకి, పోతారం, చీలాపూర్, చీలాపూర్ పల్లి, గుండారం గ్రామాల్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గురువారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తూ ముందుకు వెళ్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, ఏఎంసీ చైర్మన్ రాజయ్య, లీడర్లు చింతకింది శ్రీనివాస్ గుప్తా, లక్ష్మణ్, శేఖర్, బోనగిరి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కరెంట్పోల్పై నుంచి పడి యువకుడు మృతి
జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: కరెంట్పోల్పైనుంచి కింద పడి యువకుడు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మంద సాయిలు(29) 14వ వార్డు నబీనగర్ లో ఐ మాస్ట్ లైట్స్ సరిచేసేందుకు కరెంట్పోల్ఎక్కాడు. అది తుప్పు పట్టి ఉండటంతో పోల్ విరిగి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సాయిలును అంబులెన్స్ లో గజ్వేల్ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. అయితే లైట్స్ సరి చేయమని చెప్పింది పంచాయతీ పాలకవర్గమా లేక ఇంకా ఎవరైనా చెప్పారా అనేది తెలియాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి
మెదక్ (చిన్నశంరంపేట), వెలుగు: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో శాలిపేటకు చెందిన ఓ ఆటోడ్రైవర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆటోడ్రైవర్‌గా పనిచేసే యాదగిరి గౌడ్ (30) బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం అగ్రహారం శివారులో ఒంటిపై కాలిన గాయాలతో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి అతడిని మెదక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా కొద్దిసేపటికే చనిపోయాడు. కాగా బుధవారం రాత్రి యాదగిరి గౌడ్ కు అతని తమ్ముడు ఆంజనేయులు గౌడ్ తో గొడవ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో యాదగిరి శరీరం కాలిపోయి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు యాదగిరి గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పీజీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ర్యాలీ
చేర్యాల, వెలుగు: చేర్యాల పట్టణంలో ప్రభుత్వ పీజీ కాలేజీ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ డివిజ్కమిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ర్యాలీ చేశారు. కొత్త బస్టాండ్ నుంచి తహసీల్ఆఫీస్ వరకు వెళ్లి ర్యాలీ తీసి ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ చేర్యాల లో పీజీ కాలేజీ , ప్రీమెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని, టౌన్‌కు దూరంగా ఉన్న డిగ్రీ కాలేజీని సెంటర్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని కోరారు. అనంతరం చేర్యాల తహసీల్దార్ ఆరిఫాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి , పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యశ్వంత్, శివ, ప్రశాంత్ పాల్గొన్నారు.
చలో ఢిల్లీని సక్సెస్ చేయాలి: డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
సిద్దిపేట, వెలుగు: ఏఐసీసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కార్యకర్తలు, లీడర్లు సక్సెస్చేయాలని డీసీసీ అధ్యక్షుడు తుంకుంటా నర్సారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని మోడీ పేదలను దోచి కార్పొరేట్లకు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించే కార్యక్రమానికి జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
‘వెలుగు’ ఫొటోగ్రాఫర్ కు అవార్డు
సిద్దిపేట, వెలుగు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్(ఐఅండ్‌పీఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో సిద్దిపేట జిల్లా ‘వెలుగు’ ఫొటో గ్రాఫర్ మహిమల భాస్కర్ రెడ్డికి అవార్డు వచ్చింది. గురువారం హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అర్బన్ అండ్ రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ విభాగంలో సెకండ్ ప్రైజ్, మరో రెండు కేటగిరీల్లో కన్సోలేషన్ అవార్డులను భాస్కర్ రెడ్డి అందుకున్నారు.
దీక్ష చేస్తున్న వీఆర్ఏల అరెస్ట్
కంది, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 32 రోజులుగా దీక్షలు చేస్తున్న వీఆర్ఏలను పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. సంగారెడ్డి, కంది మండలాలకు చెందిన వీఆర్ఎలు తహసీల్దార్ ఆఫీసుల ముందు దీక్షా శిబిరంలో కూర్చోగానే పోలీసులు వచ్చి వారిని బలవంతంగా అరెస్ట్‌చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
దళితుల భూములకు పట్టాలివ్వాలని ధర్నా
చేర్యాల, వెలుగు: దళితులు సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు గురువారం చేర్యాల తహసీల్దార్ఆఫీస్ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన మెమోరాండం తహసీల్దార్ఆరిఫాకు అందించారు. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ సీలింగ్, అసైన్డ్, ఇనామ్భూములను సాగుచేసుకుంటున్నామన్నారు. ఆ భూములకు పాస్‌బుక్‌లు ఇవ్వకుండా గ్రామ అవసరాల పేరిట క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికల పేరుతో లాక్కొంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొంగరి వెంకటమావో, మండల కార్యదర్శి శ్రీనివాస్, రమేశ్, స్వర్గం శ్రీకాంత్, రవీందర్, బాలరాజు, బాలయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.
