మున్సిపాలిటీల్లో స్టేట్ క్లైమేట్ సెంటర్.. వాతావరణ మార్పులపై అప్రమత్తం చేసేలా ఏర్పాటు

మున్సిపాలిటీల్లో స్టేట్ క్లైమేట్ సెంటర్.. వాతావరణ మార్పులపై అప్రమత్తం చేసేలా ఏర్పాటు
  • ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ
  •     సీఐటీఐఐఎస్ 2.0లో భాగంగా క్లైమేట్  సెంటర్లు

హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి రాష్ట్రంలోని మున్సిపల్  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్టేట్  క్లైమేట్  సెంటర్  ఏర్పాటు చేయాలని మున్సిపల్  శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్  శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి రూ.21 కోట్లు కేటాయిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 2023లో కేంద్ర కేబినెట్ ఆమోదించిన సిటీ ఇన్వెస్ట్ మెంట్స్  టు ఇన్నొవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టెయిన్ (సీఐటీఐఐఎస్) 2.0లో భాగంగా ఈ క్లైమేట్  సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వాతావరణ మార్పులు, సెన్సిటివ్  ప్లానింగ్, యాక్షన్ ప్లాన్, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పులను గుర్తించడానికి చేపట్టనున్న కార్యక్రమాలకు నిధులు కేటాయించడం,  సెంటర్  నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటి చేస్తున్నారు. 

ఈ సెంటర్ ను రాబోయే మూడేండ్లలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్టేట్  క్లైమేట్  సెంటర్  నోడల్ ఆఫీసర్ గా మున్సిపల్  శాఖ డిప్యూటీ డైరెక్టర్  సాయినాథ్ ను నియమిస్తున్నామని ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్  వ్యవహారాల శాఖ, నేషనల్  ఇన్ స్టిట్యూట్  అర్బన్  అఫైర్స్ (ఎన్ఐయూఏ) లతో నోడల్  ఆఫీసర్ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. సెంటర్  నిర్వహణ, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలు, సాంకేతిక పరిణామాలను ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. 

స్టేట్  క్లైమేట్  సెంటర్ కు చీఫ్  క్లైమేట్  యాక్షన్ ఆఫీసర్, అర్బన్, ఎన్విరాన్ మెంట్, ఐటీ నిపుణులతో పాటు, ప్రాజెక్టు మేనేజర్ ను  నియమించుకోవాల్సి ఉంటుంది.  అర్బన్  ఏరియాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. కాలనీలు, ఇళ్లలోకి నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో క్లైమేట్  సెంటర్  ముందుజాగ్రత్తగా అధికారులను అప్రమత్తం చేస్తుంది.