టికెట్ ప్లీజ్..! మున్సిపల్ ఎన్నికల్లో పోటీ కోసం ఆశావహుల ప్రయత్నాలు

టికెట్ ప్లీజ్..! మున్సిపల్ ఎన్నికల్లో పోటీ కోసం ఆశావహుల ప్రయత్నాలు
  •     ఎమ్మెల్యేలపై ప్రెజర్​ పెడుతున్న లీడర్లు
  •     అధికార పార్టీలోనే పెరిగిన పోటీదారులు
  •     సర్వే తర్వాతే భీఫాం కేటాయింపులు అంటున్న నేతలు​

మహబూబాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఆశావాహులు టికెట్​ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అధికార పార్టీ బీఫాం పొందితే ఎన్నికల్లో సులభంగా గెలుపొందవచ్చని ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

పార్టీ కోసం తాము చేసిన సేవలు, సీనియార్టీని చెబుతూ తమకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రాలను అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లు జిల్లా పరిధిలో ఎక్కువగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండటంతో వారికి ఆశావాహుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బీఆర్ఎస్​ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎక్కువ మంది పెద్దగా ఆసక్తిని చూపడం లేదు.

మున్సిపాలిటీలలో వార్డుల వివరాలు.. 

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో మహబూబాబాద్​ 36 వార్డులు, తొర్రూరు 16, మరిపెడ15, డోర్నకల్​ 15, కేసముద్రం 16, నర్సంపేట 30, వర్ధన్నపేట 12, పరకాల 22, జనగామ 30, స్టేషన్​ఘన్​పూర్​ 18, భూపాలపల్లి 30, ములుగు 20లు ఉండగా మొత్తం 12 బల్దియా కేంద్రాల్లో 260 మున్సిపల్​ వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా వార్డులకు ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

చైర్మన్​ స్థానానికి మస్తు కాంపిటేషన్..​

మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో చైర్మన్ గా ఎంపిక కావడానికి అనుకూలమైన వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉంది. మిగిలిన చోట్ల కంటే చైర్మన్ స్థాయి పొందే చోట ఎక్కువమంది ఆశావాహులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. కొంతమందికి పార్టీ టికెట్ దక్కకున్నా రెబల్ గా పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నారు.

సర్వేల తర్వాతే భీఫాంలు.. 

అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫాం దక్కించుకుంటే ఎన్నికల్లో సులభంగా గెలుపొందవచ్చని ఎక్కువమంది పోటీ పడుతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు సైతం వివిధ సర్వే సంస్థలతో మున్సిపల్​ వార్డుల వారీగా ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏ అభ్యర్థి అయితే సమర్ధుడు, గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయో వారికి మాత్రమే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. పోటీ లేని చోట ఇప్పటికే కొందరికి సంకేతాలు ఇచ్చినప్పటికీ మిగిలిచన చోట్ల వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు.