ప్రచారానికి అడ్డాలు పర్మిట్ రూమ్ లు ..ఓటర్లను రప్పించి ‘మందు’

ప్రచారానికి అడ్డాలు పర్మిట్ రూమ్ లు ..ఓటర్లను రప్పించి ‘మందు’

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రచారం మొదలైంది. కొందరు క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నరు. మరికొందరు టికెట్లు దక్కించుకునే పనిలో ఉన్నరు. అందరూ ఎలక్షన్లలో ఎలాగైనా గెలవాలనుకుంట అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి ‘పర్మిట్​ రూమ్​ క్యాంపెయిన్ల’తో కేండిడేట్లు కొత్త తరహా ప్రచారానికి దిగారు. లిక్కర్​ తీసుకెళ్లి పంచడం, అనుచరుల ఇండ్లలో దావత్​లు ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి.. వైన్స్‌ షాపుల పక్కనే ఉన్న పర్మిట్‌ రూములనే ప్రచారానికి అడ్డాలుగా మార్చేస్తున్నరు. రోజూ కొందరు ఓటర్లను పర్మిట్​రూములకు పిలిపించుకుని ‘మందు’ పార్టీలు ఇస్తున్నరు. తమకే ఓటేయాలనుకుంట మాట తీసుకుంటున్నరు. ఇటు లిక్కర్​ లెక్కల తిప్పలు, పోలీసులు, ఎలక్షన్​ ఆఫీసర్ల తలనొప్పులు ఉండవని.. అటూ క్యాంపెయిన్​ సాగిపోతుందని భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. కౌన్సిలర్‌‌గా, కార్పొరేటర్‌‌గా గెలిచేందుకు ప్రతి ఒక్క ఓటూ కీలకం కానుంది. ఎంతో మంది ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినవారూ ఉన్నారు. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు క్యాండిడేట్లు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. పగలంతా ప్రచారం చేస్తూనే.. రాత్రివేళల్లో వివిధ గ్రూపులతో దావత్​లు పెడుతున్నరు. ఒక్కో రోజు ఒక్కో గ్రూప్‌‌కు దావత్‌‌ ఇస్తున్నరు. యూత్‌‌ అసోసియేషన్లు, వాడకట్టు, కులం, పార్టీల వారీగా సిట్టింగ్‌‌లు వేస్తున్నరు. ఇందుకోసం వైన్స్‌‌ల పక్కనే ఉన్న పర్మిట్‌‌ రూములను వేదిక చేసుకుంటున్నరు. ప్రత్యేకంగా ప్లాన్​ వేసుకుని మరీ ‘మందు’ పార్టీలు ఇస్తున్నరు.

లిస్టు ప్రిపేర్ ​చేసుకుని..

క్యాండిడేట్లు ఎవరెవరికి ఏ రోజు దావత్​ ఇయ్యాలనుకుంటున్నరని ముందే లిస్టు తయారు చేసుకుంటున్నరు. ఫలానా సమయానికి, ఫలానా పర్మిట్‌‌ రూమ్‌‌కు రావాలని వారికి చెబుతున్నరు. ఇందుకోసం సన్నిహిత అనుచరులు, బంధువుల సాయం తీసుకుంటున్నరు. కొందరు లోకల్​ లీడర్​ ఎవరైకినా పని అప్పజెప్తున్నరు. ఆ అనుచరులు, లీడర్​ సాయంత్రం కాగానే.. ఆ రోజు చెప్పిన ఓటర్లు, కులపోళ్లు, యూత్​ అసోసియేషన్లు, వాడకట్టు వాళ్లను పర్మిట్‌‌ రూమ్‌‌ దగ్గరికి తీసుకొస్తారు. వారందరినీ కూర్చోబెట్టి ‘మందు’ దావత్​ ఇస్తూ తమ వారికి ఓటేయాలనుకుంట మాట తీసుకుంటరు. కావాల్సింది తాగించడం, ఫుడ్​ తెప్పించడం చేస్తారు. దావత్​ అయిపోయినంక అనుచరులు, లీడరే బిల్లులు కడ్తరు. ఇందుకోసం ముందే సదరు పర్మిట్‌‌ రూమ్‌‌, వైన్​షాపు వాళ్లతో ఒప్పందం చేసుకుని పెట్టుకున్నరు.

పని ఈజీ అయితదని..

పర్మిట్‌‌ రూముల్లో దావత్‌‌  ఇస్తే పని ఈజీగా అయిపోతుందని క్యాండిడేట్లు భావిస్తున్నరు. గతంలో ఇండ్లలో, ఇతర ప్రదేశాల్లో ‘మందు’ పార్టీలు ఇవ్వడం కష్టంగా మారేది. ఎలక్షన్​ కోడ్‌‌ అమల్లో ఉండటంతో పోలీసు తనిఖీలు ఉంటయి. లిక్కర్​ కొనడం, తీసుకెళ్లి దాచిపెట్టడం, దావత్​లు అరేంజ్​ చేయడం పెద్ద ప్రయాస అని.. ఇండ్ల మధ్య దావత్‌‌లు పెడితే జనాల ఇబ్బంది, గోలతో సమస్య ఉంటుందన్న ఆలోచనకు వచ్చారు. ఈ సమస్యలేవీ ఉండవన్న ఉద్దేశంతో పర్మిట్​రూములకు ప్రయారిటీ ఇస్తున్నరు.

రూల్స్‌‌ పట్టించుకునేదెవరు?

ఎలక్షన్లతో పర్మిట్ రూమ్‌‌లు బార్లను తలపిస్తున్నాయి. ప్రతి వైన్‌‌ షాపుకు ఓ పర్మిట్‌‌ రూమును ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే వెసులుబాటు ఉంది. ఇందుకోసం గతంలో ప్రత్యేకంగా రూ.2 లక్షలు ఫీజు వసూలు చేసేవారు. ఇప్పుడు లైసెన్స్‌‌ ఫీజుతో కలిపే తీసుకుంటున్నారు. ఒక్కో వైన్​షాపు వద్ద 20 చదరపు మీటర్ల నుంచి గరిష్టంగా 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్‌‌ రూము ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో ఒక్క టేబుల్, ఒక్క కుర్చీ మాత్రమే వేయాలి. కానీ విశాలంగా బార్లను తలదన్నేలా పర్మిట్​రూములు ఏర్పాటు చేస్తున్నారు. 50 నుంచి 150 మందిదాకా కూర్చునేలా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సిమెంటు దిమ్మెలు, బండలతో టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక వాటిలో బాయిల్డ్‌‌ పల్లీలు, చిప్స్‌‌ వంటివి మాత్రమే అనుమతించాలి. కానీ అన్ని రకాల ఫుడ్ అమ్ముతున్నారు.