ముషీరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను పొడిగించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ వేసే సమయం లేకుండా పోతోందన్నారు. శుక్రవారం బాగ్లింగంపల్లిలోని సమితి కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం విదేశాల్లో ఉన్న సమయంలో హడావిడిగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకముందే పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించడం వల్ల బీసీలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న బీసీ అభ్యర్థులకు గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నుంచి బీఫార్మ్లు ఇప్పించి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ నారగోని మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బీసీ రాజకీయ చైతన్య యాత్రను నిర్వహించి బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
