హుస్నాబాద్ పట్టణంలోని విద్యార్థుల ధర్నాపై కలెక్టర్ హైమావతి సీరియస్

హుస్నాబాద్ పట్టణంలోని విద్యార్థుల ధర్నాపై కలెక్టర్ హైమావతి  సీరియస్

హుస్నాబాద్, వెలుగు: వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే సహించేది లేదని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంలో నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని గురువారం విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ శుక్రవారం హాస్టల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా వంటగదికి వెళ్లి స్టాక్ రిజిస్టర్​ను, ఆహార పదార్థాలను పరిశీలించారు. కూరలు నాణ్యతగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ఎందుకు అమలు చేయడం లేదని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్  మల్లేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

విద్యార్థుల ధర్నాకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్​ను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు తరచూ హాస్టళ్లను విజిట్ చేయాలని, విద్యార్థుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మరెడ్డి ఉన్నారు.