- జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాకేశ్
సంగారెడ్డి, వెలుగు: ఎన్నికల ప్రచార ఖర్చులపై పకడ్బందీగా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాకేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఏంసీసీ, ఎంసీఎంసీ నోడల్ అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు, ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల వ్యయ నియంత్రణలో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్అబ్జర్వర్లు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార ఖర్చులు ప్రతి అభ్యర్థి ఖాతాలో ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. డబ్బు, మద్యం, విలువైన వస్తువులు పంపిణీ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనుమానాస్పద లావాదేవీలు, బల్క్‌గా సరఫరా అవుతున్న వస్తువులు, నగదు కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఏ చిన్న ఉల్లంఘనకైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఎక్సైజ్ అడిషనల్ సూపరింటెండెంట్, డీసీవో కిరణ్ కుమార్, ఎంసీసీ నోడల్ అధికారి జగదీశ్, ఎంసీఎంసీ నోడల్ అధికారి విజయలక్ష్మి, ఎల్‌డీఎం నర్సింగ్ రావు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్అబ్జర్వర్లు, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, ఎన్నికల విభాగపు అధికారులు పాల్గొన్నారు.
