- ఎంపీ రఘునందన్ రావు
నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. శుక్రవారం బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం ద్వారా నిధులను తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నోటీసులతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కు సీట్ నోటీసులు ఇవ్వడం అందులో భాగమేనన్నారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఆ రెండు పార్టీల వ్యవహారం ఉందన్నారు.
బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నర్సాపూర్ కు చేసింది ఏమీ లేదని రింగ్ రోడ్ చుట్టూ వ్యాపారాలు చేసుకునేందుకే పని చేస్తాడు తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు. నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీ నిర్వహించగా ఎంపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్టాస్ మల్లేశ్ గౌడ్, కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్, అభ్యర్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
గజ్వేల్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీలది విడదీయలేని బంధమని, వారిలో ఒకరికి ఓటేస్తే మరొకరికి వేసినట్టేనని, అందుకే ఈసారి బీజేపీని గెలిపించాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. గజ్వేల్ మన్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. మూడుసార్లు వరుసగా గెలిచి గజ్వేల్ నుంచి శాసన సభ్యుడిగా చేసి రెండు సార్లు సీఎంగా చేసిన పెద్ద మనిషి కేసీఆర్ ఏఒక్కరోజూ ఇక్కడి ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి భారీగా ప్రభుత్వ భూముల్లో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్నాయకుడు వెంకట్రాంరెడ్డిమళ్లీ మున్సిపల్ ఎన్నికల కోసం డబ్బులు పంచడానికి వస్తున్నాడు.సిద్దిపేట జిల్లాలోని భూనిర్వాసితులందరూ కలసి ఈయనను ఈ ఎన్నికల్లో నిర్వాసితుడిని చేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకేనాణానికి ఉన్న బొమ్మాబొరుసులాంటివి అన్నారు. ఈసారి గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్,నాయకులు భాస్కర్ ఉన్నారు.
