మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అనుమానాలున్నప్పటికీ ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. ఆయా పార్టీలు అభ్యర్థుల ప్రాతిపాదికన మున్సిపాలిటీల్లో రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు కేవలం ఆయా పార్టీలకు సంబంధించిన వారే కాకుండా స్థానికంగా బలమైన నాయకులను సైతం అంచనా వేసుకుంటున్నారు.
పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక ఉంటే స్థానికంగా బలమైన వ్యక్తికి అవకాశాలు కల్పించాలని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు సర్వేలుచేయిస్తున్నారు. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీవార్డుల విభజన సక్రమంగా లేదంటూ చాలామంది కోర్టులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8 మున్సిపాలిటీలకు కోర్టు స్టే విధించింది. సోమ, మంగళవారంలో
మరిన్ని మున్సిపాలిటీలకు స్టే వస్తాయని ప్రచారం సాగుతుంది. ప్రధాన పార్టీలు సర్వేలతో పబ్లిక్ వాయిస్‌ను పసిగట్టి ఎన్నికల వ్యూహానికి సిద్ధం కావాలని యోచిస్తున్నాయి.సర్వేల ద్వారానే వాస్తవాలు తెలుస్తాయనే విషయాన్ని గ్రహించారు. అందులో భాగంగానే సర్వేలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ సర్వే చేయించడం ఆనవాయితీగా వస్తోంది. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి పరిషత్తు ఎన్నికల వరకు సర్వేల ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇదే పద్ధతి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించి మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్, జడ్పీటీసీ, ఎంపీటీసీలను సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని సర్వేలు చేయిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 మున్సిపాలిటీలున్నాయి. వీటిలో 7 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంప్రకటించింది. ఈ 7 కార్పొరేషన్లతో పాటు 22 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్ పార్టీ పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది.
స్థానికులకే అభ్యర్థుల ఎంపిక
టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మాకంగా మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులకే అభ్యర్థుల ఎంపికను అప్పగించింది.ఆ నాయకులు వార్డుల వారీగా అభ్యర్థులను గుర్తించి పార్టీకి విధేయుడిగా, ప్రజల్లో మంచి పట్టున్న వ్యక్తులకు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తోంది. అయితే అధిష్టానానికి పంపేందుకుమాత్రమే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, పోటీకి సై అంటున్న అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను సర్వేలతో జత కట్టి పంపించనున్నారు. ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమదైన ముద్ర వేసుకునేందుకు ప్రైయివేట్ సర్వేతో పార్టీలకు అతీతంగా ఉండేవ్యక్తులకు మున్సిపల్ ఎన్నికల్లో ఆవకాశం కల్పించాలని భావిస్తోంది.
బలమైన నేతలకు బీజేపీ గాలం
రాష్ట్రంలో మొదటిసారిగా 4 పార్లమెంట్ స్థానాలు గెలవడంతో బీజేపీ ప్రభావం పెరిగిపోయింది. దీంతో బీజేపీ మున్సిపల్ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని అడుగులు వస్తోంది. ఏవిధంగానైన మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించాలని వ్యూహాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇతర పార్టీలో ప్రధాన నాయకులపై దృష్టి సారించింది. వారందరిని పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా తెలుగుదేశానికి కంచుకోట.. ఆ కోటలో టీఆర్‌ఎస్ బలపడింది. అయినా బలమైన నాయకులు టీడీపీలో ఉన్నారని బీజేపీ ఆలోచనలో ఉంది. స్థానికంగా ప్రభావం కలగిన టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకోని మున్సిపల్ ఎన్నికల్లో అవకాశాలు కల్పించనున్నారు. దీంతో తమ సత్తా చూపేందుకు ప్రయాత్నిస్తోంది.
