మున్సి‘పోల్స్’ మరింత లేటు

మున్సి‘పోల్స్’ మరింత లేటు

రాష్ట్రంలో మున్సిపల్​ ఎలక్షన్లు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. మారిన రాజకీయ సమీకరణాలు, లోక్‌సభ రిజల్ట్స్​లో ఎదురైన చేదు అనుభవం, ఇప్పుడు ఎన్నికలకు వెళితే అనుకూల ఫలితాలొచ్చే అవకాశం లేకపోవడం నేపథ్యంలో.. మున్సిపల్‌ ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేసే యోచనలో టీఆర్​ఎస్​ సర్కారు ఉన్నట్టు తెలిసింది. ఎలక్షన్ల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు సార్లు లేఖ రాసినా సర్కారు స్పందించకపోవడం, చివరికి ఈసీ అధికారులు హైకోర్టును ఆశ్రయించాల్సి రావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

ఓటర్ల జాబితాలూ రెడీ కాలె..

రాష్ట్రంలో ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 137 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో పాతవి 63కాగా.. గతేడాది 74 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తంగా జీహెచ్​ఎంసీ మినహా మిగతా 142 మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం జూన్‌తో ముగియనుంది. లెక్క ప్రకారమైతే ఇప్పటికే ఎలక్షన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. మున్సిపాలిటీల్లో వార్డులవారీగా ఓటర్ల జాబితాను మార్చి చివరివారంలోనే ప్రదర్శించి ఉండాలి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం వంటివేవీ చేపట్టలేదు. ఇవన్నీ పూర్తయితే జులై, ఆగస్టులో మున్సిపల్‌ ఎలక్షన్లు నిర్వహించేందుకు అవకాశం ఉండేది. కానీ ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

ఈసీ రెండుసార్లు లేఖ రాసినా..

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని.. వెంటనే ఎలక్షన్​ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 24న ఒకసారి, మే 4న మరోసారి సర్కారుకు లేఖ రాసింది. ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు.. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి,

కమిషనర్లకు నోటీసులు ఇచ్చారు. రెండు వారాల్లో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుపై తగిన నిర్ణయం తీసుకోవాలని.. ఆ వివరాలను ఈసీకి తెలపాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

బీజేపీ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గుబులు…

బీజేపీ రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని జోరు మీదుంది. అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చిన ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ బలం పెంచుకుంది. ఇదే ఊపుతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు మున్సిపల్​ ఎలక్షన్లకు వెళితే ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశముందని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హైకమాండ్​ భావిస్తున్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివేదికలు కూడా టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నాయని, అందుకే  కొంతకాలం ఆగాలని సర్కారు అనుకున్నట్టు సమాచారం.

చట్ట సవరణలు చేసి..

కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లోని డివిజన్ల పునర్విభజనలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ అడ్డంకులు తొలగించేందుకు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాలకు మరోసారి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి రాష్ట్రంలో 1965 ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాల్టీ చట్టమే అమలవుతోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా కఠినమైన నిబంధనలతో ప్రత్యేక చట్టం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. జనవరిలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టానికి పలు సవరణలు చేసి కొత్త చట్టాన్ని ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అమల్లోకి తెచ్చారు. అలాగే మున్సిపాలిటీల చట్టంలో కూడా సవరణలు చేయాలని, ఇన్నాళ్లు వేరుగా ఉన్న టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాన్ని కూడా అందులో కలపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే చట్టానికి తుది రూపం వచ్చినప్పటికీ అసెంబ్లీలో ఆమోదించాకే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.