- రసకందాయంలో మున్సిపల్ ఎన్నికలు
- 26 ఏండ్ల తర్వాత వనపర్తి పీఠం
- మహిళకు కేటాయింపు
వనపర్తి, వెలుగు : మున్సిపల్ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ అయిన వనపర్తిలో 33 వార్డులున్నాయి. ఆశావహులు ఆత్మీయ సమ్మేళం పేరుతో ఆయా వార్డుల ప్రజలను పిలిచి దావత్లుఇవ్వడం మొదలుపెట్టారు. వనపర్తి మున్సిపాలిటీలోని ఓ వార్డు నుంచి పోటీచేయనున్న వ్యక్తి ఆదివారం విందుతోపాటు తలా కొంత మొత్తం ఇచ్చినట్లు సమాచారం. దీంతో అప్పుడే మున్సిపల్ఎన్నికల వేడి మొదలైనట్లు కనిపిస్తోంది.
అనుకూలం కాకుంటే భార్యలతో పోటీ..
తాజాగా రిజర్వేషన్ల నేపథ్యంలో ఆయా వార్డుల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహులు తమకు అనుకూల రిజర్వేషన్రాకపోవడంతో తమ భార్యలతో నామినేషన్లు వేయించడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలో ఏ వార్డు నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం ఉండడంతో ఆయా వార్డుల్లో గెలుపు అవకాశాలను బేరీజుచేసుకుంటున్నారు. దీంతో వార్డు నుంచి పోటీ చేసే అవకాశం రాని లీడర్లు తమ సతీమణులు లేదా సమీప బంధువులతో పోటీ చేయించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
26 ఏండ్ల తర్వాత వనపర్తి పీఠం మహిళకు..
వనపర్తి జిల్లా కేంద్ర మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. 1952 నుంచి వనపర్తి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 2000లో చైర్మన్ స్థానం మహిళలకు కేటాయించడంతో టీడీపీ నుంచి ప్రమీల గెలుపొందారు. తిరిగి 26 ఏండ్లకు వనపర్తి మున్సిపల్‌చైర్మన్ పదవి మహిళలకు వచ్చింది.
ఈ పాటికే అభ్యర్థుల స్కానింగ్..?
మున్సిపల్‌ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ టిక్కెటు ఇచ్చే విషయంలో వడబోత కార్యక్రమం ప్రారంభమైంది. ఆయావార్డుల నుంచి ఇది వరకే గెలిచి కాంగ్రెస్‌లో చేరిన అభ్యర్థుల స్కానింగ్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. కొన్ని వార్డుల్లో ఈసారి కొత్తవారికి టిక్కెట్టు ఇవ్వనున్నట్లు సంకేతాలివ్వడంతో ఆశావహులు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు.
విలీన వార్డుల్లో ఆశావహుల జోరు..
జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వనపర్తి మున్సిపాలిటీలో కలిశాయి. దీంతో 26 వార్డులున్న మున్సిపాలిటీ 33కు చేరింది. విలీనమైన గ్రామాలు వార్డులుగా మారడంతో గతంలో సర్పంచ్‌గా పనిచేసిన వారు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పల్లె ఓటర్ల నాడి జారిపోకుండా ఆశావహులు సెంటిమెంట్‌తో రంగంలోకి దిగుతున్నారు.
