- ప్రజల్లో ఉండే వారి ఇండ్ల వద్దకే బీఫామ్స్ వస్తయ్
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్, వెలుగు : మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని, కాంగ్రెస్‌కు ఎక్కడా పోటీ లేదని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నిజామాబాద్ డీసీసీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఎవరూ పైరవీలు చేయొద్దని, ప్రజల్లో ఉండి ప్రజలు కావాలనుకునే లీడర్ ఇంటికే బీఫామ్స్ వస్తాయని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొకాలడ్డుతోందని, ఈ విషయాన్ని ప్రజలంతా గ్రహించారన్నారు. రాజకీయాల కోసం కులమతాలను వాడుకోవడం సిగ్గుచేటన్నారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకుండా.. స్కీమ్‌ల పేర్లు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కులం, మతం మాటున రాజకీయాలు చేస్తున్నారని, శ్రీరాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని, ఆయనేమైనా బీజేపీ మెంబర్‌షిప్ తీసుకున్నాడా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అసలు ఏ ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారన్నారు.
బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యాయం
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపించారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సెట్ చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తోందన్నారు.
ఉద్యమ నేతగా చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ అమరుల సంఖ్యను ఒక్కో చోట ఒక్కో రకంగా ప్రకటించి మోసం చేశారని విమర్శించారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో భాగస్వామిగా ఉన్న కవిత వేస్తున్న ప్రశ్నలకే సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఆ పార్టీ లీడర్లు లేరన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్ చేసిన అవినీతిని ప్రశ్నిస్తున్న కవితకు ఎందుకు జవాబు చెప్పడం లేదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ సర్కార్ పదేండ్లలో 50 వేల ఉద్యోగాలు ఇస్తే... కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలోనే 80 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, రానున్న మూడేండ్లలో ఆ హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన తాహెర్, డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, బొబ్బలి రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొని ప్రసంగించారు.
