బాసరలోని వసంత పంచమి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

బాసరలోని వసంత పంచమి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

బాసర, వెలుగు: బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి దేవి అమ్మ వారి సన్నిధిలో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహించే వసంత పంచమి ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం అందించారు. సోమవారం హైదరాబాద్​లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంతోపాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్​కు ఆలయ ఈవో అంజనీదేవి, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ముందుగా సీఎంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి ప్రసాదాలు అందించారు. 

అనంతరం సీఎం, మంత్రి చేతుల మీదుగా వసంత పంచమి ఉ త్సవ ఆహ్వాన పత్రిక, వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లగా త్వరలో పనులు చేపడుతామని హామీ ఇచ్చినట్లు ఆలయ అధికారులు తె లిపారు.