- రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి
- చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, కోటపల్లిలో పర్యటన
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో కొత్తగా సీసీ రోడ్లు నిర్మిస్తామని, బోర్లు ఏర్పాటు చేయించి నీటి ఎద్దడి రాకుండా చూస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. సోమవారం చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, కోటపల్లి మండలం పరిధిలో మంత్రి పర్యటించారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో తెల్లవారుజామున 6 గంటల నుంచి 11 గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు.
సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 7, 8, 9 వార్డుల్లో, మల్లికార్జున్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇల్లీగల్ లేఅవుట్లు చేపట్టారని, కనీసం రోడ్లు, డ్రైనేజీలకు ప్లానింగ్ కూడా చేయలేదని ఆరోపించారు.
మౌలిక సౌలత్లు లేక ప్లాట్లు కొన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాత కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. కొత్త నిధులు పెట్టి సీసీ రోడ్లు, డ్రైయినేజీలను నిర్మిస్తామన్నారు. రూ.40కోట్లతో అమృత్ స్కీం ద్వారా డ్రింకింగ్ వాటర్ స్కీం పనులు నడుస్తున్నాయన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
చెన్నూరు మున్సిపాలిటీ వార్డుల్లో బైక్ నడుపుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. చనిపోయిన, అనారోగ్యం బారిన పడ్డ కుటుంబాలను పరామర్శించారు. ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగితెలుసుకున్నారు. చెన్నూరు మండలం కన్నెపల్లి, లంబాడిపల్లి దారి మధ్యలో ఐకేపీ సెంటర్ గ్రౌండ్లో కాంగ్రెస్ లీడర్లు చైతన్య, ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు హాజరైన మంత్రి మహిళలకు బహుమతులు అందజేశారు.
లంబాడిపల్లిలో వీవో బిల్డింగ్పనులకు భూమిపూజ చేశారు. మంత్రి వెంట జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, రవికుమార్, డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్తివారీ, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.
