
హైదరాబాద్, వెలుగు:
మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపుకోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని పూర్తి గా కాలరాసిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆంధ్రా కోటాలో ఎంపీగా ఉన్న కేకేతో దొంగ ఓటు వేయించి గెలిచారని, మున్సిపల్ చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినీతి, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. లక్ష్మణ్ మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ లకు వారి పాలనపై నమ్మకముంటే మేయర్, చైర్మన్ ఎన్నికల్ని ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహణకు ఎందుకు భయపడ్డారని నిలదీశారు. అక్రమాలకు పాల్పడుతూ ఆదర్శాలను వల్లించడం కేసీఆర్, కేటీఆర్ లకే చెల్లిందని విమర్శించారు.
తుక్కుగూడపై ఫిర్యాదు చేస్తం
తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చిందని, కేవలం ఐదు స్థానాల్లోనే గెలిచిన టీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ పదవిని ఎలా గెలుచుకుంటుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. ‘‘ఎంపీతో దొంగ ఓటేయించి గెలవడమే కేసీఆర్ నైతికతా? పక్క రాష్ట్ర కోటాలో ఎంపీగా ఉన్న కేకే ఓటేయడం ఏంటి? 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ చైర్మన్ పదవిని పొందాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్ ఏకంగా ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో అడ్డదారిలో చైర్పర్సన్ పదవి దక్కించుకుంది. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను రద్దు చేసే వరకు బీజేపీ పోరాడుతుంది. రూల్స్‌కు విరుద్ధంగా ఓటేసిన కేకేపై చర్య తీసుకోవాలని రాష్ట్రపతికి, రాజ్యసభ చైర్మన్ కు.. ఎన్నిక రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తం..” అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, వందలాది మంది ఎంపీలున్నారని.. తాము కేసీఆర్‌లా ఎంపీలందర్నీ తెచ్చి ఓట్లేయిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో సంపాదించిన అవినీతి సొమ్మును టీఆర్ఎస్ క్యాండిడేట్ల గెలుపు కోసం ఖర్చు చేశారని ఆరోపించారు. నిజామాబాద్ లో మూడో ప్లేస్‌లో నిలిచిన టీఆర్ఎస్ మేయర్ పదవిని ఎలా గెలుచుకుంటుందన్నారు.
కేసీఆర్ ను మించిన నియంతల్లేరు..
దేశంలో కేసీఆర్ ను మించిన నియంత మరొకరు లేరని, ఆర్టీసీ కార్మికులను అడిగితే ఆ నియంతృత్వ పోకడలు తెలుస్తాయని లక్ష్మణ్ విమర్శించారు. ‘‘వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు.. కేసీఆర్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. నిత్యం అసంతృప్తి, కుర్చీ పోతుందేమోనన్న అభద్రతా భావం, చేసే తప్పులు బయటపడతాయోమోననే భయం, పరాయి విజయాలను కూడ తన విజయాలుగా చెప్పుకోవడం వంటివన్నీ కేసీఆర్ లో ఉన్న
లక్షణాలు” అని పేర్కొన్నారు.