- కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కుదిరేనా?
- సీపీఐ, సీపీఎంతో పొత్తు కోసం తహతహలాడుతున్న బీఆర్ఎస్
- కార్పొరేటర్ సీటు కోసం దరఖాస్తుల వెల్లువ
- సీటు పక్కా అనుకున్నవాళ్లు పెంచిన ఇంటింటి ప్రచారం జోరు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయా.. లేదా.. అనే అంశం ఇప్పుడు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఒక గూటికి చేరుతాయా, లేక సమీకరణాలు మారి బీఆర్ఎస్, వామపక్షాల మధ్య స్నేహం కుదురుతుందా.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ పొత్తులు తమ విజయవకాశాలను దెబ్బతీస్తాయో.. లేక కలిసి వస్తాయో తెలియక కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులపై కన్నేసిన ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్న ఆశావహులు
ఎన్నికల నగారా మోగకముందే ఆశావహులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు ఇంటింటికీ స్వీట్లు పంపిణీ చేయడం, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం లాంటి కార్యక్రమాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ‘అమ్మా బాగున్నావా.. అన్నా ఏం చేస్తున్నావ్’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల చెంతకు చేరుతున్నారు. అయితే, పొత్తులపై స్పష్టత లేకపోవడంతో తాము కష్టపడుతున్న డివిజన్లు లేదా వార్డులు వేరే పార్టీల ఖాతాలోకి వెళ్తాయేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.
ఆ పార్టీలకు దరఖాస్తుల వెల్లువ..
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు గానూ కాంగ్రెస్ పార్టీకి 170కి పైగా దరఖాస్తులు రాగా, బీఆర్ఎస్‌కు 120కి పైగా అప్లికేషన్లు అందాయి. వామపక్ష పార్టీల అభ్యర్థులు మాత్రం పొత్తులపై తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయినప్పటికీ, తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు. పొత్తుల ముడి వీడితే తప్ప అభ్యర్థుల జాబితాపై పూర్తి స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
పొత్తుల కోసం అగ్రనేతల మధ్య సంప్రదింపులు..
పొత్తుల విషయంలో పార్టీల అగ్రనేతల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సీపీఐ మొగ్గు చూపుతుండగా, సీపీఎం కూడా సానుకూలత వ్యక్తం చేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కుదరని పక్షంలో, ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్‌తో జతకట్టేందుకు వామపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తుగడలు ఫలించి ఏ పార్టీలు ఒక్కటవుతాయోనన్న చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతోంది.
