ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేడెక్కిన మున్సిపల్ పోరు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేడెక్కిన మున్సిపల్ పోరు
  • అందరి కంటే ముందే  అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్     
  • రంగంలోకి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ 
  • రెబల్స్ బెడద లేకుండా బుజ్జగింపులు 

నల్గొండ, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను గెలిచి హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు పక్కగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. నామినేషన్ కు ఒక్క రోజే గడువు ఉండడంతో ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా గెలవగలిగే సామర్థ్యమున్న అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఇన్‌‌చార్జి మంత్రితో పాటు జిల్లా మంత్రులు రంగంలోకి దిగారు. 

నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు పెంచి నల్గొండ కార్పొరేషన్ ను చేజిక్కించుకునేలా మేయర్ తో పాటు అన్ని వార్డుల్లో క్యాండిడేట్లను ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెబల్స్ బెడద లేకుండా అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ పోరులో పోటీ లేకుండా కాంగ్రెస్ గెలిచేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. 

సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న మంత్రి ఉత్తమ్..

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జగదీశ్ రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతీయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.  గత మున్సిపల్ ఎన్నికల్లో  బీసీలు, ఓసీలు పోటీ పడటంతో ఎస్సీ మహిళను చైర్మన్ చేయగా ఇప్పుడు జనరల్ చైర్మన్‌‌గా సూర్యాపేట మున్సిపాలిటీ రిజర్వు అయింది. 

 దీంతో చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొనగా ఇప్పటికే కొంతమందిని బుజ్జగించి పోటీలో లేకుండా చేశారు.  సూర్యాపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్ సతీమణికి చైర్మన్ పదవి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం, పటేల్ రమేశ్ రెడ్డి వర్గం మధ్య టికెట్ల కోసం పోటాపోటీ నెలకొనగా అభ్యర్థులను వడపోసేందుకు ప్రత్యేకంగా సమన్వయ కమిటీని నియమించింది. 

ఈ కమిటీ 48 వార్డుల్లో అభ్యర్థులను తేల్చగా నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. రెబల్స్ లేకుండా కట్టడి చేస్తేనే ఎన్నికల్లో పార్టీ గెలవడం సాధ్యమవుతుందని లేదంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలే పట్టణంలో కూడా రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. చైర్మన్ పీఠం దక్కాలంటే కనీసం 30 వార్డులు గెలుపొందాలని, ఆ మేరకు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. 

దూకుడు పెంచిన మంత్రి కోమటిరెడ్డి 

నల్గొండ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయ్యాక జరుగతున్న మొదటి ఎన్నిక కావడంతో ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకునేలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సతీమణి చైతన్య రెడ్డిని ప్రకటించారు. అన్ని వార్డుల్లో సర్వే చేయించి గెలుస్తారనే నమ్మకం ఉన్న 44 మంది అభ్యర్థుల జాబితాను స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.

 అయితే ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారాన్ని ప్రారంభించేసింది. మేయర్ పీఠం కోసం పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిని మంత్రి జోక్యం చేసుకొని సముదాయించడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. వీటితో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో రెబల్స్ బెడద లేకుండా ఇన్‌‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే అన్నీ మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించగా.. సర్వే ఆధారంగా నామినేషన్ చివరిరోజు కంటే ముందే అభ్యర్థులను ఎంపిక చేశారు.