ఎస్పీఎం వర్సెస్ మున్సిపల్ .. కంపెనీ కట్టిన గోడలు తొలగించిన మున్సిపల్​అధికారులు

ఎస్పీఎం వర్సెస్ మున్సిపల్ .. కంపెనీ కట్టిన గోడలు తొలగించిన మున్సిపల్​అధికారులు
  • రెండ్రోజుల కింద ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు
  • అక్కడే ఏర్పాటు చేసిన రేకులు, పైపులు తాజాగా లొలగింపు 
  • ఎస్పీఎంకు వ్యతిరేకంగా సాగుతున్నలారీ ఓనర్స్ సమ్మె
  • లారీల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం, స్థానిక మున్సిపాలిటీ మధ్య వివాదం ముదురుతోంది. పేపర్​ మిల్లు యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా లారీ ఓనర్లు 20 రోజులుగా సమ్మెబాట పట్టడం మరింత ఆజ్యం పోస్తోంది. ఈ సమ్మె కొనసాగుతుండగానే కంపెనీని నడిపిస్తున్న జేకే యాజమన్యానికి, మున్సిపల్ పాలకవర్గానికి మధ్య వార్ జరుగుతోంది. ఎస్పీఎం కంపెనీ రోడ్డుపై అక్రమంగా గోడలు కట్టిందని మున్సిపల్​ అధికారులు తొలగించడం.. అదే ప్రాంతంలో రేకులు వేయడం.. వాటిని మున్సిపల్​ అధికారులు మళ్లీ తొలగించడం.. కేసులు, ప్రతికేసులు.. ఇలా కాగజ్​నగర్ ​పట్టణంలో వాతావరణం హీటెక్కుతోంది.

కూల్చివేతతో కేసులు, ప్రతికేసులు

డీపీసీఏ ప్లాన్​లో ఉన్న మున్సిపల్ రోడ్లపై ఎస్పీఎం కంపెనీ అక్రమంగా గోడలు కట్టిందని ముందస్తు నోటీస్ ఇచ్చి కమిషనర్ అంజయ్య, మున్సిపల్ పాలకవర్గం మూడ్రోజుల కింద ఆ గోడలను కూల్చివేసింది. అయితే, తమ ప్రాపర్టీలోని కట్టడాలను దౌర్జన్యంగా కూల్చేశారని మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో పాటు పలువురు కౌన్సిలర్ల మీద కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గిరి టౌన్ పోలీస్​స్టేషన్​లో కేసులు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తమ విధులకు ఆటంకం కలిగించి, కులం పేరుతో తిట్టారని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఏకే మిశ్రా, గిరి, చీఫ్ జనరల్ మేనేజర్ రమేశ్ రావు, సెక్యూరిటీ చీఫ్ సతీశ్​సింగ్ మీద మున్సిపల్ కమిషనర్ అంజయ్య అట్రాసిటీ కేసు పెట్టారు.

లారీ ఓనర్స్ సమ్మెతో మొదలైన వివాదాలు

ఎస్పీఎం కంపెనీ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కాగజ్​నగర్​లో లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మె చేపట్టడంతో వివాదం మొదలైంది. ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం కంపెనీలో క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, కంపెనీ ఇచ్చే మొత్తం లోడింగ్ లో స్థానిక లారీలకే ప్రయారిటీ ఇవ్వాలని, ఐదేండ్లుగా పెంచని రేట్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలను ఎన్నిసార్లు కంపెనీ యాజమాన్యం ముందుంచినా పట్టించుకోవడంలేదని స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్​ 20 రోజుల కింద సమ్మె మొదలుపెట్టింది.

అయితే, సమ్మె విరమించేలా మొదట్లో సురేశ్​ కుమార్​ సైతం అసోసియేషన్ సభ్యులు, కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కలెక్టర్ సమక్షంలోనూ పలుమార్లు చర్చలు జరిగినా ఇవేవీ ఫలించలేదు. ఈ నెల 14 న కాగజ్ నగర్​కు వచ్చిన మంత్రి సీతక్కను కూడా లారీ ఓనర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కాదని వేరే ప్రాంతాలకు చెందిన లారీలతో ముడిసరుకు తెప్పించి, లోడింగ్ ఇస్తోందని, దీంతో తాము ఉపాధి కోల్పోతున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు వెన్న కిశోర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అన్ని కంపెనీల కన్నా తాము మంచి రేటు ఇస్తున్నామని యాజమాన్యం పేర్కొంటోంది. 

ఎస్పీఎం వైఖరికి నిరసనగా అఖిలపక్షం ధర్నా

లారీ డ్రైవర్ ఓనర్స్ స్థానికులు కావడం, వాళ్ల ఉపాధి మీద ఎఫెక్ట్ పడుతుండడంతో మద్దతు పెరిగింది. కంపెనీ యాజమాన్యం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ఎక్కువగా ఇస్తోందని మండిపడుతున్నారు. కంపెనీ కట్టిన గోడలను మున్సిపల్​అధికారులు కూల్చివేయగా.. ఆ జాగాలో యాజమాన్యం పైపులు, రేకులు కట్టి మళ్లీ రోడ్డును బ్లాక్ చేసింది. దీంతో వాటిని తీయాలని అఖిల పక్షాలు గురువారం ధర్నా చేపట్టాయి. యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. మున్సిపల్​అధికారులు అక్కడికి చేరుకొని ఆ పైపులు, రేకులను తొలగించారు.

ఆరు లారీల అద్దాలు ధ్వంసం

గురువారం పైపులు, రేకులను తొలగింపు తర్వాత స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో నిలిపి ఉన్న ఆరు లోడ్ లారీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఏపీలోని నందిగాం నుంచి ముడి సరుకు తెచ్చిన లారీల అద్దాలు పగులగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్పీ సురేశ్ కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ధ్వంసమైన లారీలను పరిశీలించి బాధ్యులను గుర్తించాలని, చర్యలు తీసుకోవాలని కాగ జ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ ను ఆదేశించారు. సాయంత్రానికి పొలీస్ బందోబస్తు  నడుమ అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.