- పెద్ద మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లకూ ఫుల్ డిమాండ్
- అన్ని పార్టీల నుంచి రంగంలోకి ఆశావహులు
- కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికల
- ఖర్చులు భరిస్తామంటూ ఆఫర్లు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో మేయర్సీట్లకు మస్తు పోటీ నెలకొన్నది. పెద్ద మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్లకూ ఫుల్ డిమాండ్ ఉన్నది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో మెజారిటీ మేయర్, చైర్మన్సీట్లను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో అన్నీ పార్టీల నుంచి ఆశావహులను రంగంలోకి దించారు. మేయర్, పెద్ద మున్సిపాలిటీ చైర్మన్లుగా ఎన్నిక కావాలని భావించే వాళ్లు తమ పరిధిలోని మెజారిటీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. దీనికోసం అవసరమై ప్రచార ఖర్చులు భరిస్తామంటూ పార్టీలకు ఉల్టా ఆఫర్లు ఇస్తున్నారు. మొత్తం ఖర్చంతా మాదే అని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకుటుంబ సభ్యులు, మాజీ మున్సిపల్చైర్మన్లు, బడా బడా పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు.. రియల్ఎస్టేట్ ప్రతినిథులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసి పార్టీలకు ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో డబ్బులు ఖర్చు పెట్టేవారికి రాజకీయ పార్టీలు తొలుత ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీళ్లే తమ మేయర్, చైర్మన్ అభ్యర్థులని అక్కడక్కడ అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అనధికారికంగా లీకులు ఇచ్చి ఎలక్షన్స్‌కు వెళుతున్నారు.
కార్పొరేషన్లలో మేయర్సీటుపైనే అందరి కన్ను
రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ముందుగా ప్రత్యక్షంగా 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. కార్పొరేషన్లలో మెజారిటీ సీట్లు గెలిచిన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను, మున్సిపాలిటీల్లో గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. అయితే, రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు కేంద్రంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండతో పాటు జిల్లా కేంద్రాలుగా ఉన్న మంచిర్యాల, కొత్తగూడెం, సింగరేణి కేంద్రమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మేయర్ సీట్హాట్ కేక్‌గా మారింది. ఎమ్మెల్యేకు ఏ స్థాయి ప్రాధాన్యం ఉంటుందో.. ఆ తర్వాత మేయర్‌కు అంతే ప్రాధాన్యం దక్కుతుంది. దీంతో ఈ స్థానాల్లో మేయర్‌గా ఎన్నిక కావడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. పార్టీ ఫండ్ కాకుండా ఒక్కో చోట రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పైగా సొంతంగా ఖర్చు పెట్టడానికి ఆశావాహులు ముందుకొస్తున్నారు.
- కరీంనగర్ మేయర్ సీటు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాన అనుచరుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్.. అలాగే, మాచర్ల ప్రసాద్, మల్లికార్జున్, రాజేందర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుడు, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి భర్త, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు. బీజేపీలో మేయర్ సీటుకు ఇక్కడ పెద్ద పోటీ ఉన్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన విద్యా సంస్థల అధినేత సౌగాని కొమురయ్య, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ కౌన్సిలర్ వాసాల రమేశ్ పోటీ పడుతున్నారు.
- రామగుండంలో మేయర్ సీటు ఎస్సీ జనరల్ అయ్యింది. మేయర్ సీటు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏకంగా రామగుండం సింగరేణి మాజీ జీఎం కల్వల నారాయణను బరిలోకి దింపింది. పార్టీ ఫండ్ కాక మిగతా కార్పొరేటర్లకు అవసరమై ఖర్చంతా ఈయనే భరించేలా ఒప్పించింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తాజా మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఇక్కడ మేయర్ అభ్యర్థుల పేర్లు పెద్దగా వినిపించడం లేదు.
- మహబూబ్ నగర్ మేయర్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. సీఎం రేవంత్ సొంత జిల్లా ఇది. ఇక్కడ పోటీ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే కొనసాగుతున్నది. బీజేపీ ఎంపీ డీకే అరుణ మేయర్ సీటు గెలుచుకోవడానికి పట్టుదలగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే అన్నీ పార్టీల కంటే ముందుగానే 47 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసి ఎలక్షన్స్‌లో నామినేషన్లు వేయించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తాజా మాజీ మేయర్ ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న, ప్రస్తుత మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ (ముడా) లక్ష్మణ్ యాదవ్ భార్య, ముదిరాజ్ వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎన్పీ వెంకటేశ్ కూతురు మేయర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒంటరిగానే పోరాడుతున్నారు. మేయర్ క్యాండెట్‌ను ప్రకటించలేదు.
- నల్గొండ మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే చకిలం రాజేశ్వర్‌రావు కోడలు చకిలం వసంత లక్ష్మీని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ పోటీ పడుతున్న వారు స్వతహాగా రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
- నిజామాబాద్ మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ కన్పిస్తున్నది. నిజామాబా ద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ (నుడా) కేశ వేణు భార్య, రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ డీసీసీ ప్రెసిడెంట్మానాల మోహన్‌రెడ్డి కోడలు పోటీ పడుతున్నారు.
- బీజేపీ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ మేయర్ సీటుకోసం అభ్యర్థులు స్వతహాగా రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చినట్లుగా సమాచారం.
- మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోనే మేయర్ సీటు కోసం పోటీ నడుస్తున్నది. ఇక్కడ ఏ పార్టీ కూడా మేయర్ అభ్యర్థులను ఖరారు చేయలేదు.
చైర్పర్సన్లకూ ఫుల్ డిమాండ్
రాష్ట్రంలోని పెద్ద మున్సిపాలిటీల్లో కూడా చైర్పర్సన్లకు ఫుల్‌డిమాండ్ నెలకొన్నది. మిర్యాలగూడ మున్సిపల్‌చైర్మన్ సీటు కోసం ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కొడుకు సాయిప్రసన్న, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నలబోతు భాస్కర్ రావు కోడలు పోటీలో ఉన్నారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో లక్ష్మారెడ్డి, భాస్కర్‌రావు పోటీ పడ్డారు. ఇప్పుడు చైర్మన్ సీట్కోసం వీరి వారసులు ఒక్కొక్కరు రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేటలో బడా కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి బడా కాంట్రాక్టర్భార్య నివేదిత, బీఆర్ఎస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్, వ్యాపార వేత్త జండూరి ప్రకాశ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా రూ.20 కోట్లకు పైగా ఖర్చుకు వెనుకాడబోమని అభ్యర్థులు సంకేతాలు ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో రిటైర్డ్ ఉద్యోగుల భార్యలు చైర్ పర్సన్పోటీలో ఉన్నారు. వరుసకు వదిన మరదళ్లు అయిన వీళ్లు ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసి గెలిపించుకుంటామని ముందుకొచ్చారు. జగిత్యాలలో ఎలక్షన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్వర్గీయులు నామినేషన్లు వేశారు. ఎవరికి బీ ఫామ్‌లు ఇస్తారు.. ఎవరిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం ఇంకా తేలలేదు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక పార్టీ అధిష్టానమే తలపట్టుకుంటోంది. కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, వంటి పెద్ద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నడుస్తున్నది.
