- జనవరి 30వ తేదీ వరకు నామినేషన్లు
- 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలకు షెడ్యూల్
- అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కమిషనర్ రాణి కుముదిని
- ప్రచారానికి ఆరు రోజులే గడువు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం (జనవరి 27) ప్రకటించారు. 414 డివిజన్లు, 2,582 వార్డులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు.
షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 30 చివరి తేదీ. ఫిబ్రవరి 3 బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 11న బ్యాలెట్ పేపర్తో ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తారు. 13న ఫలితాలు ప్రకటించి, 16న పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించడంతో మున్సిపోల్స్ ప్రక్రియ ముగియనుంది. కాగా, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు బంద్ కానున్నాయి.
ఇవాళ్టి (జనవరి 28) నుంచే నామినేషన్ల స్వీకరణ:
ఎన్నికలు జరుగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల (జనవరి) 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఫీజును ఆర్వోలకు చెల్లించాల్సి ఉంటుంది.
కార్పొరేషన్లలో పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.5 వేలు, మున్సిపాలిటీల్లో అయితే రూ.2,500 చొప్పున, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే కార్పొరేషన్లలో రూ.2,500, మున్సిపాలిటీల్లో రూ.1,250 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒక వార్డులో ఒక అభ్యర్థి ఇదే ఫీజుపై ఎన్ని సెట్ల నామినేషన్ అయినా వేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ వార్డుల్లో పోటీ చేస్తే మాత్రం ప్రతీ వార్డుకు వేర్వేరుగా నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు తప్పకుండా తహసీల్దార్ జారీ చేసిన కులం సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది.
పార్టీ క్యాండిడేట్స్ అయితే బీ ఫారాలు అందించాలి. 31న స్ర్కూటినీ, ఫిబ్రవరి 1న తొలగించిన నామినేషన్లపై అప్పీల్స్ స్వీకరణ, 2న విచారణ, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రా, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, గుర్తులు ప్రకటిస్తారు.
మొత్తం ఓటర్లు 52.43 లక్షలు
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబోయే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 26.80 లక్షలు, పురుషు లు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కంటే మహిళా ఓటర్లే 1.18 లక్షల మంది ఎక్కువగా ఉండడం విశేషం. ఓటర్ల పరంగా పరిశీలిస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 3.48 లక్షల మంది ఓటర్లు ఉండగా 3.40 లక్షల ఓటర్లతో కరీంనగర్ కార్పొరేషన్ రెండోస్థానంలో నిలిచింది.
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో అతి తక్కువగా 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. మొత్తం 35 మున్సిపాలిటీల్లో కేవలం 15 వేల లోపు ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మరో 42 మున్సిపాలిటీల్లో 15 వేల నుంచి 30 వేల లోపు ఓటర్లు ఉండగా, 23 మున్సిపాలిటీల్లో 30 వేల నుంచి 60 వేల లోపు, ఇంకో 14 మున్సిపాలిటీల్లో 60 వేల నుంచి లక్ష లోపు ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా 120 చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
ప్రచారానికి ఆరు రోజులే గడువు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారానికి ఆరు రోజుల గడువు మాత్రమే ఉంటుంది. 3న గుర్తులు కేటాయించాక 11న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కన్నా 48 గంటల ముందుగానే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులకు ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే వీలుంటుంది. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటిం చింది. కార్పొరేషన్లలో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు గరిష్టంగా రూ.10 లక్షలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ అభ్యర్థులు రూ.5 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా బ్యాంకులో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలి.
నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి సంబంధిత ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా ఈ బ్యాంకు అకౌంట్ వివరాలను తప్పక అందించాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ నుంచే అభ్యర్థి తన ఎన్నికల వ్యయాన్ని మొత్తం ఖర్చు చేసి వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు అందచేయాలి. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, వెహికల్స్ రెంట్, మైక్, డీజే, సభలు, సమావేశాల ఖర్చు, సోషల్ మీడియా ప్రచారం, ఇతర ఖర్చులు మొత్తం లెక్క చూపించాల్సి ఉంటుంది.
బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం 8,203 పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. 16,031 బ్యాలె ట్ బాక్సులను ఉపయోగించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను 137 స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న జరిగే కౌంటింగ్ కోసం 136 సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 31,428 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు 742 మంది జోనల్ ఆఫీసర్లు, 279 ఎఫ్ఎస్టీ, 381 ఎస్ఎస్టీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.
ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి..
మున్సిపల్ ఎన్నికల కోసం ఓటు హక్కు పొందిన 52.43 లక్షల మంది ఓటర్లు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ రాణి కుముదిని విజ్ఞప్తిచేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. మున్సి పల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ల కార్యాలయాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వార్డులవారీగా రిజర్వేషన్ల వివరాలు:
బీసీలకు: 854 (28.5%)
ఎస్సీలకు: 444(14.8%)
ఎస్టీలకు: 187 (6.24%)
జనరల్ : 1,511 (50.4%)
మొత్తం వార్డులు: 2,996
ఇతర వివరాలు:
పోలింగ్ స్టేషన్ల సంఖ్య: 8,203
బ్యాలెట్ బాక్స్‌లు: 16,031
కౌంటింగ్ కేంద్రాలు: 136
రిటర్నింగ్ ఆఫీసర్లు(ఆర్వో): 1,379
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు: 1,547
ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవో): 9,560
ఇతర పోలింగ్ సిబ్బంది: 31,428
జోనల్ ఆఫీసర్లు: 742
ఎన్నికల పర్యవేక్షణ టీమ్‌లు: 660
మున్సిపల్
ఎన్నికల ముఖ్యాంశాలు
ఎన్నికలు నిర్వహించే కార్పొరేషన్లు:07
కార్పొరేషన్లలో డివిజన్లు 414
మున్సిపాలిటీలు 116
వీటిలోని వార్డులు 2582
ఓటర్లు
మహిళలు:
26.80 లక్షలు
పురుషులు:
25.62 లక్షలు
ఇతరులు:
640 ఓటర్లు
మొత్తం ఓటర్లు
52.43
లక్షలు
