- ‘మున్సిపల్స్’ రిజర్వేషన్ల తారుమారుతో పలువురి నేతల ఆశలు ఆవిరి
- కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్అభ్యర్థి కోసం పార్టీల వెతుకులాట
- అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్లకు తీవ్ర పోటీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని రాజకీయ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అన్నట్లుగా రిజర్వేషన్లు వెలువడటంతో చాలా మంది ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జనరల్, బీసీ, ఎస్సీ వర్గాల నేతలకు నిరాశే ఎదురైంది. ఎవరూ ఊహించని విధంగా ఈ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. తమకు పట్టున్న డివిజన్లలో రిజర్వేషన్లు మారడంతో మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నేతలు ఇప్పుడు తమకు అనుకూలంగా ఉండే సేఫ్ డివిజన్ల కోసం వేట
మొదలుపెట్టారు.
అభ్యర్థి కోసం అన్వేషణ..
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీలకు దక్కడంతో, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సమర్థుడైన అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించాయి. 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో అధికారం దక్కించుకోవాలంటే అభ్యర్థులు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యయాన్ని భరించగలిగే సత్తా ఉన్న అభ్యర్థుల కోసం కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు వెతుకుతున్నాయి. కార్పొరేటర్లను కాపాడుకోవడం, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో, ఆర్థికంగా బలంగా ఉన్న కొత్త ముఖాలను రంగంలోకి దించేందుకు వ్యూహాలు
రచిస్తున్నారు. గెలుపు కోసం పక్కాగా ప్లాన్ వేయడంలో ఎవరికివారు నిమగ్నమయ్యారు.
ఇల్లెందు, అశ్వారావుపేట లమున్సిపాలిటీల్లోనూ తీవ్ర పోటీ
ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్ పదవి గతంలో మాదిరిగానే మళ్లీ బీసీ మహిళకే రిజర్వ్ కావడంతో మాజీ చైర్ పర్సన్ మడత రమతో పాటు పలువురు మహిళా నేతలు రేసులో నిలిచారు. కొందరు నాయకులు తమ భార్యలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. తొలి చైర్మన్‌గా చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో మహిళా నాయకురాళ్లు అప్పుడే తమ పావులు కదుపుతున్నారు.
సీనియర్‌నేతలకు ఎదురుదెబ్బ.. సేఫ్ డివిజన్లపై కన్ను..
రిజర్వేషన్ల మార్పుతో సీనియర్ నాయకులు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వై. శ్రీనివాస్ రెడ్డి, దామోదర్, కాపు సీతాలక్ష్మి లాంటి వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనరల్ స్థానాలు ఎస్సీ, బీసీ లేదా మహిళలకు రిజర్వ్ కావడంతో వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఇదే సమయంలో ఐఎన్‌టీయూసీ నేత ఆకునూరు మురళి కుమార్తె సుప్రియ లాంటి కొత్త తరం నేతలకు ఈ రిజర్వేషన్లు కలిసి వచ్చాయి.
మాజీ కౌన్సిలర్లుగా, వారి భార్యలు కౌన్సిలర్లుగా ఉన్న కంచర్ల జమలయ్య, మాచర్ల శ్రీనివాస్, పిడుగు శ్రీనివాస్, ఎంఏ రజాక్, ధర్మరాజు లాంటి వాళ్లకూ రిజర్వేషన్లు తారుమారు కావడంతో వారు నిరాశకు గురయ్యారు. తమ సొంత వార్డుల్లో రిజర్వేషన్లు కలిసి రాని మాజీలు, తమ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న పక్క వార్డులపై కన్నేసి, అక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
