లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ ఆర్వో, బిల్ కలెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ ఆర్వో, బిల్ కలెక్టర్

 నిర్మల్, వెలుగు :  ఓ ఇంటి అసెస్​మెంట్ కు సంబంధించి నిర్మల్  మున్సిపల్  రెవెన్యూ ఆఫీసర్  గంగాధర్, బిల్ కలెక్టర్  నవంత్  రూ.3,500 లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థానిక ఏఎన్ రెడ్డి కాలనీలో ఇల్లు  నిర్మించుకున్న ఆర్టీసీ కంట్రోలర్  గోపాల్ రెడ్డి నుంచి వారు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఇన్​స్పెక్టర్లు తిరుపతి, జాన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

తన ఇంటి అసెస్​మెంట్  కోసం కొద్ది రోజులుగా మున్సిపల్  ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న గోపాల్ రెడ్డిని సదరు రెవెన్యూ ఆఫీసర్, బిల్  కలెక్టర్ రూ.10 వేల లంచం డిమాండ్  చేశారు. మొదటి విడతగా రూ.3,500 ఇస్తానని బాధితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటికే మున్సిపల్  అధికారుల తీరుతో విసిగిపోయిన గోపాల్ రెడ్డి.. ఏసీబీని సంప్రదించారు. దీంతో గోపాల్  రెడ్డి లంచం ఇస్తుండగా మున్సిపల్ ఆర్వో, బిల్  కలెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.