- అయోమయంలో ఆశావహులు
మెదక్, వెలుగు: జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ టికెట్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్లతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు ఈ సారి టికెట్ రేసులో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతుండడంతో ఆశావహులు పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలకు అప్పగించాయి. దీంతో ఆశావహులు వారి ద్వారా పార్టీ టికెట్సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తమ అనుచరుల ద్వారా ఆయా నాయకులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కలుస్తున్నారు. తమకు ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. వార్డులో తమకున్న పరపతి, పట్టు, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కార్యక్రమాల కోసం, గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాము చేసిన కృషిని వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు టికెట్ మీకే అని వెళ్లి వార్డ్ లో ప్రచారం చేసుకోవాలని చెబుతున్నా ఆశావహులకు నమ్మకం కుదరడం లేదు. వారు అడిగిన అందరికీ అలానే చెబుతుండడంతో బీ ఫామ్ చేతికి అందితేనే టికెట్పక్కా అని భావిస్తున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలు మెజారిటీ కౌన్సిలర్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇతర పార్టీ నేతలను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో టికెట్లకు పోటీ ఎక్కువవుతోంది. ఇప్పటి వరకు టికెట్ తమకే వస్తుందన్న ధీమాలో ఉన్న లీడర్లు ఇతర పార్టీ లీడర్ల చేరికతో అయోమయానికి గురవుతున్నారు.
మరోవైపు ఉన్న పార్టీలో ఛాన్స్ రాదేమో అన్న డౌట్‌తో మరో పార్టీలోకి వెళ్దామనుకుంటున్నా అక్కడ సైతం ఇదే పరిస్థితి ఉంటుందని ఆలోచిస్తున్నారు.మొత్తం మీద అధికారికంగా కౌన్సిలర్అభ్యర్థుల జాబితాలు వెల్లడయ్యే వరకు ఆశావహులకు టెన్షన్ తప్పేటట్టు లేదు.
